ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా టీజర్ రిలీజైనప్పుడు కుర్రకారు గొంతు తడారిపోయింది. పాయల్ మరోసారి తన విశ్వరూపం చూపించిందని అంతా అనుకున్నారు. బూతు డైలాగ్స్, లిప్ కిస్ సీన్స్ విచ్చలవిడిగా పడ్డాయి. అలాంటి సినిమా నుంచి వస్తున్న ట్రయిలర్ మరింత ఘాటుగా, ఇంకాస్త సెగ పెంచేలా ఉంటుందని అంతా భావించారు. కానీ ఆర్డీఎక్స్ లవ్ ట్రయిలర్ చప్పగా ఉంది.
ఇంకా చెప్పాలంటే.. రొమాంటిక్ టీజర్ చూపించి, యాక్షన్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. అవును.. ఆర్డీఎక్స్ లవ్ టీజర్ చూసి మరిన్ని ఆశలు పెట్టుకున్న కుర్రకారును నిరాశపరిచింది ట్రయిలర్. ఇదొక ఫక్తు లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. తాజా ట్రయిలర్ తో.. అసలు సినిమాలో హాట్ సీన్స్ ఉంటాయా ఉండవా అనే డౌట్స్ కూడా మొదలయ్యాయి.
ఏ సినిమా ట్రయిలర్ అయినా టీజర్ కు కొనసాగింపుగా ఉంటుంది. కానీ ఆర్డీఎక్స్ లవ్ టీజర్-ట్రయిలర్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఒకటి ఉత్తర దృవం అయితే ఇంకోటి దక్షిణ దృవం అన్నట్టు తయారైంది పరిస్థితి. టీజర్ నుంచి వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని ట్రయిలర్ ను ఇలా కట్ చేశారేమో అనుకోవాలి.
మొత్తమ్మీద మేకర్స్ మాత్రం తాము అనుకున్నది సాధించారు. టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నారు. అది నెరవేరింది. ట్రయిలర్ తో ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఆర్డీఎక్స్ లవ్.