ఇప్పుడు టాలీవుడ్ లో రీ రీలీజ్ ల ఫీవర్ పట్టుకుంది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు ఏవీ థియేటర్ లోకి రావపోవడం అన్నది కూడా ఈ తరహా వ్యవహారానికి ప్రోత్సాహం ఇచ్చింది.
పవన్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ప్రతి హీరో ఓల్డ్ హిట్స్ థియేటర్లలోకి రావడం మొదలైంది. మొదట్లో ఒకటి రెండు షో లు అనుకున్నది ఇప్పుడు రీ రిలీజ్ వరకు వెళ్లింది. నిజానికి పాతిక ముఫై ఏళ్ల కిందట చూసుకుంటే చాలా సినిమాలు ఇలాంటి హడావుడి ఏమీ లేకుండానే థియేటర్లలోకి వస్తూనే వుండేవి.
సినిమాలకు గ్యాప్ వస్తే చాలు. తమకు హక్కులు వున్న సినిమాలు అన్నీ బయటకు తీసి వేస్తూనే వుండేవారు. దేవదాస్ లాంటిది అప్పట్లో రీరీలీజ్ చేస్తే అదో సంచలనం.
కట్ చేస్తే..ఈ తరానికి వస్తే…ఈ రీ రిలీజ్ లు అన్నవి ఈ మధ్య అలవాటుగా మారుతున్నాయి. అలా మారడం వరకు బాగానే వుంది. వంద రోజులు ఆడిన సినిమాలు, ఆన్ లైన్ లో రెడీగా వున్న సినిమాలు, మళ్లీ మరోసారి ఎగబడి చూడడానికి ఫ్యాన్స్ కు సరదా వున్నంత వరకు ఫరవాలేదు. కానీ ఈ హీరో లేదు, ఆ హీరో అని లేదు. ఫ్యాన్స్ థియేటర్లలో వెర్రితలలు వేయడం మాత్రం దారుణమైన వ్యవహారం.
ప్రతి సినిమాకు థియేటర్లలో సీట్లు చింపేస్తున్నారు. తెరలు కాల్చేస్తున్నారు. కాకినాడ నుంచి లండన్, అమెరికా వరకు ఇదే వ్యవహారం. పోనీ వీళ్లంతా చదువుకోని వాళ్లా అంటే అదీ కాదు. బాగా చదువుకున్నవాళ్లే…విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లిన వాళ్లే. కానీ అస్సలు విజ్ఙత అన్నది లేదు. సభ్యత సంస్కారం అన్నది లేదు. వీళ్లు విదేశాల్లో తాము వుండే ఫ్లాట్ ల్లో ఇలా బిహేవ్ చేయగలరా? అలా చేస్తే రెండో రోజు బయటకు తోసేస్తారు. కానీ థియేటర్లలో మాత్రం చెలరేగపోతారు.
ఈ మధ్య రీ రిలీజ్ అయిన ఓ సినిమాకు చాలా జిల్లాల్లో థియేటర్లు ఇవ్వమన్నారు. కానీ హీరో తరపున కొందరు రంగంలోకి దిగి థియేటర్లు సెట్ చేసారు. మొహమాటానికి పోయి చాలా మంది థియేటర్లు ఇచ్చారు. కానీ మళ్లీ సీట్లు చిరిగాయి. స్క్రీన్ లు కాలిపోయాయి. ఇప్పుడు వాళ్లంతా తమను మొహమాటపెట్టిన వారిని తిట్టుకుంటున్నారు. ఇకపై అస్సలు మొహమాటాలకు పోకూడదని, థియేటర్లు ఇవ్వకూడదని మొహమాటపడకూడదని డిసైడ్ అయ్యారు.
కానీ మళ్లీ ఈ మొహమాటలు తప్పవు. థియేటర్లు ఇవ్వక తప్పదు. మళ్లీ తెరలు కాలక తప్పదు. సీట్లు చిరగక తప్పదు. ఎందుకంటే మన అభిమానులు అంతా బాగా చదువుకున్న వాళ్లు. తెలిసి ఇలాంటి పనుల చేస్తున్న వారు. చదువుకోని వాడికి కొంచెమైనా భయం వుంటుంది. చదువుకున్నవాళ్లకు అది వుండదు. అదే సమస్య.