Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్ పై బండ్ల ఎటాక్.. అసలు కారణం ఇదేనా?

త్రివిక్రమ్ పై బండ్ల ఎటాక్.. అసలు కారణం ఇదేనా?

బండ్ల గణేష్ ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే అలా విరుచుకుపడడం వెనక ఆయన కారణాలు ఆయనకుంటాయి. కొన్నిసార్లు రాజకీయ కారణాలతో, మరికొన్నిసార్లు సినీ కారణాలతో, ఇంకొన్నిసార్లు వ్యక్తిగత/వ్యాపార కారణాలతో బండ్ల విరుచుకు పడుతుంటారు.

మొన్నటికిమొన్న హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య నడిచిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ పై ఫోకస్ పెట్టాడు ఈ నిర్మాత కమ్ బిజినెస్ మేన్. త్రివిక్రమ్ ను ఇండస్ట్రీలో అంతా గురూజీ అంటారనే విషయం తెలిసిందే. కాబట్టి బండ్ల గణేశ్ కూడా గురూజీ అంటూ అందుకున్నాడు.

గురూజీని కలిసి భారీ గిఫ్ట్ ఇస్తే చాలు నిర్మాత అయిపోవచ్చంటూ ఓ ట్వీట్ వేసిన బండ్ల, ఆ వెంటనే భార్యభర్త, తండ్రికొడుకు, గురుశిష్యులు.. ఇలా ఎవ్వర్ని విడదీయాలన్నా గురూజీకే సాధ్యం అంటూ మరో సంచలన ట్వీట్ వేశారు.

త్రివిక్రమ్ పై బండ్లకు ఎందుకంత కోపం..?

ఈ ట్వీట్స్ సంగతి పక్కనపెడితే.. త్రివిక్రమ్ పై బండ్ల గణేశ్ ఉన్నఫలంగా విరుచుకుపడ్డానికి రీజన్ ఏమై ఉంటుందా అనేది అందరి ప్రశ్న. దీనికి స్పష్టమైన సమాధానం దొరక్కపోయినా, సాలిడ్ రీజన్ మాత్రం ఒకటి గట్టిగా వినిపిస్తోంది.

ప్రస్తుతం పవన్ తో సినిమా చేయాలంటే ఎవరైనా త్రివిక్రమ్ ను కలవాల్సిందే. పవన్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రూటు ఒక్కటే దగ్గరదారి. త్రివిక్రమ్ సెట్ చేస్తున్న ప్రాజెక్టులకే పవన్ ఎక్కువ కాల్షీట్లు ఇస్తున్నాడు. కేవలం త్రివిక్రమ్ ను ప్రసన్నం చేసుకోలేదు కాబట్టే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో పడిందనేది బహిరంగ రహస్యం.

అంతేకాదు.. వినోదాయశితం రీమేక్ గా వస్తున్న బ్రో సినిమా, మరో మలయాళీ రీమేక్ భీమ్లానాయక్ సినిమాలు త్రివిక్రమ్ చొరవతోనే పవన్ ఫిల్మోగ్రఫీలో ముందుకొచ్చాయి. ఫలితంగా హరిహర వీరమల్లు సినిమా లేట్ అయింది. ఓజీ సినిమా ఇలా కొబ్బరికాయ కొట్టించుకొని, అలా సెట్స్ పైకి వెళ్లడానికి గురూజీనే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పవన్ తో బండ్లకు యాక్సెస్ కట్ అయిందా..?

ఇప్పుడీ లిస్ట్ లో బండ్ల గణేశ్ కూడా ఉన్నాడు. తన దేవుడు పవన్ తో సినిమా చేయబోతున్నట్టు చాన్నాళ్ల కిందటే ప్రకటించాడు బండ్ల. ఆ టైమ్ లో పవన్ తో దిగిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. అంతే, ఆ తర్వాత మళ్లీ అప్ డేట్ లేదు. ఇద్దామన్నా, పవన్ వరకు వెళ్లడానికి బండ్లకు యాక్సెస్ దొరికినట్టు లేదు. అలా త్రివిక్రమ్ వల్ల తన ప్రాజెక్టు లేట్ అవుతుందనే కోపంతో బండ్ల గణేశ్ ఇలా ట్వీటేశాడని చాలామంది భావిస్తున్నారు.

మరికొందరు మాత్రం బండ్ల-త్రివిక్రమ్ మధ్య అభిప్రాయబేధాలు తీన్ మార్ సినిమా నుంచే ఉన్నాయంటున్నారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరించాడు. అదే టైమ్ లో ఆ సినిమా నిర్మాత బండ్లతో త్రివిక్రమ్ కు గ్యాప్ వచ్చిందనే వాళ్లు కూడా ఉన్నారు. నిజంగా వీళ్ల మధ్య సంబంధాలు బాగుంటే.. ఈపాటికి త్రివిక్రమ్ తో కనీసం ఒక్క సినిమానైనా బండ్ల గణేశ్ చేసి ఉండేవారనేది చాలామంది తీస్తున్న లాజిక్. భీమ్లా ప్రీ-రిలీజ్ టైమ్ లో త్రివిక్రమ్ ను ఉద్దేశించి, బండ్ల మాట్లాడినట్టు లీకైన ఆడియో క్లిప్ కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

ఈ కారణాల వల్లనే బండ్ల గణేశ్, ఇప్పుడు 'గురూజీ'పై డైరక్ట్ ఎటాక్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఈ విమర్శల్ని ట్విట్టర్ ఎకౌంట్ లేని త్రివిక్రమ్ ఎలా తిప్పికొడతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?