గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ వ్యవహారం. ఒకవైపు మన్నత్ లో షారూక్ అన్నపానీయాలు మానేసి అల్లాడిపోతున్నాడట.. అని అంటోంది మీడియా. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన తనయుడు ఎన్సీబీ కస్టడీలో, ఆర్థర్ జైల్లో సాధారణ ఖైదీల్లో ఒకడిగా ఎలా ఉన్నాడో.. అని షారూక్ తీవ్రంగా సతమతం అవుతూ ఉన్నాడని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది. షారూక్ తనయుడు ఎన్సీబీ కస్టడీలోకి వెళ్లి వారం కావొస్తోంది. అలలపై కదిలే షిప్ లో పార్టీ చేసుకోవడానికి వెళ్లిన వాడు, అనూహ్యంగా ఖైదీ అయిపోవడం ఏ తల్లిదండ్రులకు అయినా షాకింగ్ అంశమే.
షారూక్ ఖాన్ ను, అతడి స్టార్ డమ్ ను పక్కన పెట్టి చూసినా.. యుక్తవయసులోని తనయుడు జైలుకు వెళ్లడం సయించే అంశం కాదు. షారూక్, గౌరీలు కన్నీరుమున్నీరవుతున్నాడని, బాలీవుడ్ కింగ్ ఖాన్ హెల్ప్ లెస్ అయిపోయాడని.. బాలీవుడ్ మీడియా చెబుతుంటే, ఈ వ్యవహారంపై తనదైన రీతిలో ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
షారూక్ ఫ్యాన్స్ అంతా ఎన్సీబీకి థ్యాంక్స్ చెప్పుకోవాలని అంటున్నాడు ఆర్జీవీ. షారూక్ నిజమైన ఫ్యాన్స్ అంతా ఇదే పని చేస్తారని అంటున్నాడు. ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ సూపర్ స్టార్ గా చేసిందని, ఈ వివాదంతో ఆర్యన్ కు ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చిందని ఆర్జీవీ అంటున్నాడు. ఒక రకంగా అయితే వర్మ వాదన నిజమే! మొన్నటి వరకూ ఆర్యన్ ఖాన్ మొహాన్ని చూసింది కేవలం పేజ్ త్రీ పాఠకులు మాత్రమే.
అవి కూడా క్లారిటీ లేని ఫొటోలు, బ్లర్ అయిన చిత్రాల్లో షారూక్ తనయుడిని చూసే వాళ్లు. అయితే ఇప్పుడు షారూక్ తనయుడి ఫుల్ క్లారిటీ పిక్చర్లు మీడియాలో వస్తున్నాయి. అంతే కాదు.. షారూక్ తనయుడి పేరు దేశ వ్యాప్తంగా మోగిపోతోంది. నెగిటివ్ పబ్లిసిటీనే కావొచ్చు, ఏదైనా పబ్లిసిటీనే కదా! ఇదే వర్మ చెబుతోంది. ఆర్యన్ ఖాన్ పేరు దేశ వ్యాప్తంగా తెలియని వారికి కూడా తెలియడానికి ఈ డ్రగ్స్ వ్యవహారం ప్రధాన పాత్ర పోషించి ఉండొచ్చు. అయితే షారూక్ మాత్రం ఇలా కోరుకోకుని ఉండడు కదా.
షారూక్ సై అంటే.. ఆయన తనయుడిని పెట్టి వంద కోట్ల సినిమాను తీయడానికి కూడా బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఎప్పుడో రెడీ అనే పరిస్థితి. కాబట్టి.. పాపులారిటీ, పబ్లిసిటీనే కావాలనుకుని ఉంటే.. షారూక్ ఇప్పటికే ఆ పని మొదలుపెట్టే వాడు. తన తనయుడిని జీవితాన్ని ఆస్వాధించడానికి వదిలాడు షారూక్. అదే ఇలా తేడా కొట్టినట్టుగా ఉంది!