డైరెక్షన్ చేయడమనేది ప్రతి నటుడికి చిరకాల వాంఛ. ఎక్కువ మంది తమ కోరికల్ని మనసులోనే చంపేసుకుంటూ ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది మాత్రమే డైరెక్టర్ కావాలనే ఆశయాన్ని నెరవేర్చుకుంటుంటారు. అలా తన జీవితాశయాన్ని జబర్దస్థ్ నటుడు కిరాక్ ఆర్పీ ఎట్టకేలకు నెరవేర్చుకోవడం విశేషం.
‘జబర్దస్థ్’, ‘అదిరింది’ కామెడీ షోలతో తెలుగు ప్రేక్షకుల మనసును నటుడు కిరాక్ ఆర్పీ గెలుచుకున్నాడు. అతనికి ఎప్పటి నుంచో దర్శకుడు కావాలనే బలమైన కోరిక ఉంది. అయితే డైరెక్టర్ కావడం అంటే హాస్యం పండించడం కాదు. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా కిరాక్ మాత్రం దర్శకత్వంలోని మెలకువలను నేర్చుకుంటూ వస్తున్నాడు. తన కల నెరవేర్చుకునే సమయం రానే వచ్చింది.
జేడీ చక్రవర్తి, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రలలో శ్రీపద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం నిర్మిస్తున్న చిత్రానికి ఆర్పీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆదివారం పూజలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా బ్రదర్ నాగబాబు హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు చెప్పాడు.
ఈ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో ఆసక్తికరమైన కథ దొరకడంతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకునేందుకు ముందుకొచ్చానన్నాడు. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలిపాడు. త్వరలో హైదరాబాద్, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేపట్టనున్నట్టు నూతన దర్శకుడు తెలిపాడు.