రికమెండేషన్లు మామూలు వ్యాపారాలకే కాదు సినిమాలకూ వుంటాయి. హీరో డేట్ లు, డైరక్టర్ డేట్ లు సంగతి పక్కన పెడితే సినిమా అమ్మకాలకు కూడా రికమెండేషన్లు, సిఫార్సులు, పరిచయాలు తప్పవు. లాభసాటి సినిమా అవుతుంది అనుకున్న సినిమాలను కొనేందుకు ఎక్కువ మంది పోటీ పడతారు. వీళ్లలో ఎవరు బెటర్ అన్నది నిర్మాత చూసుకుంటారు. అందరూ బెటరే అయినపుడు రికమెండేషన్లు అవసరం పడతాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పుడు ఇదే జరిగింది.
బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి సినిమా. ఎన్టీఆర్-చరణ్-ఆలియాభట్ లాంటి తారాగణం. అందువల్ల మంచి అంచనాలు వున్నాయి. ఆంధ్ర ఏరియాకు వంద కోట్ల రేషియో చెబుతున్నారు. ముందు బయ్యర్లు ముందు వెనుక ఆడారు కానీ, ఇప్పుడు పోటీ పడుతున్నారు. వందకోట్ల రేషియో అయినా రెడీ అంటున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలి అన్నది పాయింట్.
అందుకే రాజమౌళి, ప్రభాస్, ఎన్టీఆర్, కొరటాలశివ ఇలా పలువురి రికమెండేషన్లు అవసరం పడ్డాయి. ఆంధ్రలో కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రికమెండేషన్ వుండడం విశేషం.
ఇప్పటికే రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటికి మూడు ఏరియాలు ఇచ్చారు. వైజాగ్, సీడెడ్, కర్ణాటక. ఇందులో కర్ణాటకు మాత్రం ఆసియన్ సునీల్ భాగస్వామి. ఇన్ని ఏరియాలు సాయి కొర్రపాటికి ఇచ్చారంటే దాని వెనుక రాజమౌళి వున్నారు అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఎన్టీఆర్ కు, కొరటాల శివకు సన్నిహితుడైన భరత్ చౌదరికి ఈస్ట్ గోదావరి హక్కులు లభించాయి. ఇక్కడ ప్రభాస్ కు బంధువులు కూడా పోటీ పడ్డారు. వేరే చాలా మంది పోటీ పడినా ఈ ఇద్దరి ముందు తేలిపోయారు. ఆఖరికి ఇద్దరికీ కలిపి భాగస్వామ్యం మీద ఇచ్చారు. ఆ విధంగా అక్కడ రికమెండేషన్లు పలించాయి.
నెల్లూరుకు లోకల్ బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. తొమ్మిది కోట్లు అనగానే కాస్త జంకారు. దాంతో గ్రేట్ ఇండియా సుధాకర్ రంగంలోకి వచ్చి తీసుకున్నారు.
నైజాం దిల్ రాజు, ఆసియన్ సునీల్ ఇంకా పలువురు పోటీ పడ్డారు. ఆసియన్ సునీల్ 60 నుంచి 70 మధ్య దాకా వెళ్లి వదిలేసారు. దాంతో 75 ప్లస్ జిఎస్ టి లెక్కన దిల్ రాజు తీసుకున్నారు. దిల్ రాజుకు ఓ ఏరియా ఇచ్చేస్తే, రేపు మరో సినిమాను పోటీగా తమ సినిమా మీదకు తీసుకురారు అనే ఉద్దేశంతో ఆయనకు ప్రయారిటీ ఇచ్చారని వినిపిస్తోంది.
గుంటూరు ప్రభాస్ స్వంత మనుషులు అయిన యువి క్రియేషన్స్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కృష్ణ మాత్రం ఇంకా పెండింగ్ లో వుంది. వెస్ట్ గోదావరి విషయంలో కూడా ఒకటి రెండు పేర్లు వినిపిస్తున్నాయి. లేదు ప్రవీణ్ కు ఖరారయిపోయిందని వినిపిస్తోంది. ఇక్కడ ఒక్క చోటనే ఏ రికమెండేషన్ లేకుండా పని జరిగినట్లు కనిపిస్తోంది.