మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న ఆచార్య సినిమా విడుదలకు రోజు రోజుకు అవరోధాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు వున్న దారులు అన్నీ మూసుకుపోయాయి. ఇక మిగిలింది అక్టోబర్ ఒక్కటే. ఆర్ఆర్ఆర్ సినిమా రాకపోవచ్చు అనే మాట టాలీవుడ్ లో ఇప్పటికీ వినిపిస్తోంది.
ఎందుకంటే థర్డ్ వేవ్ అన్నదే పెద్ద కారణం. ఆర్ఆర్ఆర్ రావాలంటే అమెరికా నుంచి ఆంధ్ర వరకు అన్ని చోట్ల సినిమాల విడుదలకు ఏ ఇబ్బందీ, మరే అడ్డంకీ లేకుండా వుండాలి. ఆ పరిస్థితి వుంటుందా? అన్నదే అనుమానం.
అందుకే అక్టోబర్ ఆశలను మూడు సినిమాలు వదులుకోవడం లేదు. ఒకటి ఆచార్య. రెండు అఖండ..మూడోది అఖిల్ బ్యాచులర్ సినిమా. నిన్నటికి నిన్న డిస్ట్రిబ్యూటర్లతో ఆచార్య విడుదల డేట్ గురించి డిస్కషన్లు సాగించారు. జనవరి విడుదల మంచి చెడ్డలు ఆరా తీసారు. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాతలు అర్జెంట్ గా డేట్ ప్రకటించేసారు.
దీంతో ఇప్పుడు జనవరి డేట్ ప్రకటించాలా? వద్దా? అని ఆచార్య డౌట్ లో పడినట్లు బోగట్టా. తెగించి ప్రకటిద్దాం అంటే ఇద్దరు టాప్ మెగా హీరోల సినిమాలు ఒకేసారి అంటే ఎంత ఇబ్బందిగా వుండాలో అంత ఇబ్బందిగానూ వుంటుంది. పైగా ఆచార్యను భారీ రేట్లకు ఇప్పటికే అమ్మేసారు. ఇప్పుడు ఆ రేట్లు రమ్మన్నా రావు. ఇంత కాంపిటీషన్లో ఆ రేట్లు కట్టడానికి ఏ బయ్యర్ కూడా ముందుకు రాడు.
పోనీ పవన్ సినిమా డ్రాప్ అవుతుంది అనుకున్నా మహేష్ సినిమా, ప్రభాస్ సినిమా వుంటాయి కదా? వాళ్ల సినిమా మధ్య మెగా సినిమా శాండ్ విచ్ అయిపోతే ఎంత నామర్దా? అసలే సైరా గాయం ఇంకా మాననే లేదు.
ఇప్పుడు మరోసారి అలాంటి దెబ్బతింటే మెగా లైనప్ అంతా మాయం అయిపోతుంది. అందువల్ల ఆచార్యకు మిగిలిన ఆశ అంతా ఆర్ఆర్ఆర్ వాయిదా మీదనే.