అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు సంబంధించి తాజాగా ఓ పుకారు బాగా వైరల్ అయింది. మలయాళంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో, తెలుగు రీమేక్ విషయానికొచ్చేసరికి మాత్రం ఓ పాత్రను బాగా తగ్గిస్తున్నారంటూ ప్రచారం జరిగింది.
పవన్ కోసం రెండో పాత్రను లైట్ చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. వీటిని ఆ మూవీ డైరక్టర్ సాగర్ చంద్ర ఖండించాడు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో రెండు బలమైన పాత్రలుంటాయి.
రెండూ మంచి పాత్రలే. వాటిలో ఉన్న ఫీల్, సోల్ చెడిపోకుండా.. మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామని సాగర్ చంద్ర ప్రకటించాడు. అంతేతప్ప, ఏ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించడం లేదంటున్నాడు ఈ దర్శకుడు.
మరోవైపు రీమేక్ లో పవన్ పాత్రపై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు. పవన్ ను ఓ అభిమానిగా తను ఎలా చూడాలనుకుంటున్నాడో ఓ ఐడియా ఉందని.. ఆ ఐడియాస్ ను ఈ రీమేక్ లో చొప్పిస్తానని చెప్పుకొచ్చాడు.
తను చేసిన మార్పులు పవన్ కల్యాణ్ కు నచ్చాయని, ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్మకంగా చెబుతున్నాడు.
పవన్ లైనప్ లో ట్రంప్ కార్డులా ఎంటరైంది ఈ రీమేక్ సినిమా. వకీల్ సాబ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమానే పూర్తిస్థాయిలో సెట్స్ పైకి రాబోతోంది. ఈ రెండు సినిమాల గ్యాప్ లో క్రిష్ సినిమాకు సంబంధించి ఓ 10 రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేస్తాడు పవన్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం కాబోతోంది.