రీసెంట్ గా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దంపతులు కొత్త ఇంట్లోకి మారారు. ముంబయిలోని తమ పాత ఇంటికి కొన్ని అడుగుల దూరంలో ఈ కొత్త ఇల్లు కూడా ఉంది. సర్వ హంగులతో, అన్ని సౌకర్యాలతో ఉన్న లగ్జరీ హౌజ్ అది. సరే.. ఈ సంగతి పక్కనపెడితే, మరి కరీనా-సైఫ్ తాము ఖాళీ చేసిన పాత ఇంటిని ఏం చేశారు?
ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఫార్చ్యూన్ హైట్స్ ఇంటిని సైఫ్-కరీనా దంపతులు అద్దెకు ఇచ్చారు. అవును.. మీరు విన్నది నిజమే. వాళ్లు తమ పాత ఇంటిని అద్దెకు ఇచ్చారు. అసొసియేషన్ మీడియా అనే సంస్థ ద్వారా గిల్టీ అనే కంపెనీ సైఫ్-కరీనా పాత ఇంటిని అద్దెకు తీసుకుంది. దీని అద్దె అక్షరాలా మూడున్నర లక్షలు. ఏడాదికి కాదు, నెలకు మాత్రమే.
బాంద్రాలోని ఆ సువిశాలమైన ఇంటిని నెలకు 3 లక్షల 50వేల అద్దె చెల్లించేలా మూడేళ్లకు అగ్రిమెంట్ రాయించుకుంది గిల్టీ అనే కంపెనీ. సరిగ్గా సైఫ్ తన 51వ పుట్టినరోజు వేడుకలకు మాల్దీవులకు వెళ్లడానికి ముందు ఈ అగ్రిమెంట్ పై సంతకం చేశాడు. ఆగస్ట్ 13 నుంచి ఈ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది.
అగ్రిమెంట్ ప్రకారం మొదటి ఏడాది, నెలకు మూడున్నర లక్షలు చొప్పున, రెండో ఏడాది నెలకు 3 లక్షల 67 వేల చొప్పున, మూడో ఏడాది నుంచి నెలకు 3 లక్షల 87 వేల చొప్పున అద్దె చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్కెట్ రేటు ప్రకారం ఈ ఇంటి విలువ 12 నుంచి 14 కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది.
సాధారణంగా సెలబ్రిటీలు తాము నివశించిన ఇళ్లను అద్దెకివ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇచ్చినా సమీప బంధువులకు ఇస్తారు లేదా ఆఫీస్ కింద వాడుకుంటారు. కానీ సైఫ్-కరీనా మాత్రం తమ ఇంటిని ఏకంగా ఓ కంపెనీకి అద్దెకిచ్చేశారు.