సలార్… హడావుడి చప్పబడింది

సలార్. కొన్ని నెలల క్రితం వరకు అదో డైనోసార్. ప్రతి తెలుగు సినిమా సలార్ ఎప్పుడు తమ మీద పడుతుందా అని భయపడ్డాయి. కొన్ని రోజుల క్రితం సలార్ వాయిదా పడితే ఎక్కడొచ్చి మీద…

సలార్. కొన్ని నెలల క్రితం వరకు అదో డైనోసార్. ప్రతి తెలుగు సినిమా సలార్ ఎప్పుడు తమ మీద పడుతుందా అని భయపడ్డాయి. కొన్ని రోజుల క్రితం సలార్ వాయిదా పడితే ఎక్కడొచ్చి మీద పడుతుందో అని కిందా మీదా అయ్యాయి. సలార్ టీజర్ తరువాత మరో హడావుడి లేదు. పైగా రీ షూట్ లు, గ్రాఫిక్స్ బాగాలేదనే మాటలు వినిపించడం ప్రారంభమైంది. ఈ లోగా ఓవర్ సీస్ బయ్యర్లకు రేటు తగ్గించారనే వార్తలు వచ్చాయి. ఇంతలో సలార్ విడుదల టైమ్ కు ఒకటి రెండు రోజలు అటు ఇటుగా తమ సినిమాలను ప్లాన్ చేయడం మొదలైంది.

సలార్ సినిమా నిర్మాతలు ఎందుకో సినిమా పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సినిమాకు ఇప్పటికే ఇనఫ్ బజ్ వచ్చిందని డిసైడ్ అయిపోయారేమో. సినిమా విడుదల ఇంకో రెండు నెల్లలో వుంది. ఇప్పటి వరకు వచ్చింది కేవలం ఒక్క టీజర్ మాత్రమే. సాధారణంగా పాటలు వుంటే వాటిని విడుదల చేస్తారు. సలార్ లో పెద్దగా పాటలు వుండవని, ఒకటి లేదా రెండు మాత్రమే అని వినిపిస్తోంది. మరి అందుకేనేమో పాటలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అంతకు మించి ముందుగా వదిలే కంటెంట్ ఏమీ లేదు.

కనీసం అప్పుడో స్టిల్.. అప్పుడో స్టిల్ వదిల్తే అది వేరుగా వుంటుంది. అలాగే మిగిలిన నటుల లుక్స్ కూడా వదలొచ్చు. ప్లాన్ చేస్తే ప్రతి రెండు వారాలకు ఓసారి ఏదో ఒకటి వదలడం పెద్ద కష్టం కాదు. కానీ సలార్ నిర్మాతలు ఎందుకో మరి అటు దృష్టి సారిస్తున్నట్లు కనిపించడం లేదు. 

సినిమా మార్కెటింగ్ తలకాయనొప్పులే వారి టైమ్ ను తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్ర, నైజాం బిజినెస్ లు ఇంకా క్లోజ్ కాలేదు. గతంలో కెజిఎఫ్, కాంతారా సినిమాలను ఎటువంటి అడ్వాన్స్ లు లేకుండా, తక్కువ కమిషన్ కు ఇవ్వడం అలవాటు చేసారు. ఇప్పుడు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ అడుగుతున్నారు. దాంతో బయ్యర్లు కిందా మీదా అవుతున్నారు. దాంతో పాటు నిర్మాతలు పెట్టే కండిషన్లు కూడా రుచించడం లేదు.

ఎవ్వరూ ముందుకు రాకపోతే, వాళ్లే దిగుతారనే ధోరణిలో వున్నారు. మొత్తం మీద సలార్ వ్యవహారం కాస్త అటు ఇటుగానే వుంది. సరైన ట్రయిలర్ పడితే తప్ప సినిమా మీద మళ్లీ ఆసక్తి పెరగదు. ఇలాంటివి అన్నీ చూసి, ఒకటి రెండు సినిమాలు సలార్ విడుదల డెేట్ కు కాస్త అటు ఇటుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్ 22 నుంచి జనవరి 10 వరకు వున్న స్పేస్ ను వాడుకోవాలనే ఆలోచన కావచ్చు.

మొత్తం మీద సలార్ కాస్త జూలు విదల్చాలి. లేదంటే భయం వుండదు.