సమంత కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, మంచి వ్యాపారవేత్త కూడా. తను సంపాదిస్తున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఈ-కామర్స్ సైట్ లో వ్యాపార భాగస్వామిగా చేరింది ఈ హీరోయిన్.
సస్టెయిన్ కార్ట్ అనే స్టార్టప్ కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీకి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. గతేడాది జనవరిలో లాంచ్ చేసిన ఈ కంపెనీలో పర్యావరణసహిత వస్తువుల్ని అమ్ముతారు. దుస్తులు, ఇంటీరియర్ డెకరేషన్ నుంచి హెల్త్ ప్రాడెక్టులు, సౌందర్య ఉత్పత్తులు.. ఇలా ఎన్నో రకాల ఉత్పత్తుల్ని ఇందులో అందుబాటులో ఉంచారు. అన్నీ పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులే.
పర్యావరణం, ప్రకృతిపై ఎక్కువగా శ్రద్ధ చూపుతుంది సమంత. ప్రస్తుతం తను తినే కూరగాయలు, ఆకుకూరల్ని కూడా తనే సేంద్రియ పద్ధతిలో పండించుకుంటోంది. అందుకే ఈ స్టార్టప్ కంపెనీకి ఈజీగా కనెక్ట్ అయింది. పెట్టుబడులు కూడా పెట్టింది.
సమంత ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఆమెకు సొంతంగా సాకీ అనే డిజైనరీ బ్రాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ స్టార్టర్ ప్ లో కూడా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో రన్ అవుతున్న ఈ కంపెనీ, త్వరలోనే వివిధ నగరాల్లో స్టోర్స్ కూడా ఏర్పాటుచేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నాటికి మొదటి స్టోర్ లాంఛ్ చేయాలనుకుంటోంది.
ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది సమంత. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతోపాటు మరో ద్విభాషా చిత్రంలో ఆమె నటించనుంది.