హీరోయిన్ సమంత ఆరోగ్యం మీద ఆమే క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ క్లారిటీ కాస్త ఆందోళనకరంగానే వుంది. తాను మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది సమంత.
గత కొంత కాలంగా చర్మ సమస్య అని, మరోటి అని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు ఆ సమస్య ఏమిటన్నది సమంతనే క్లారిటీ ఇచ్చింది.
చేతికి డ్రిప్ కనెక్షన్ తో ఒక ఫొటో కూడా జతచేసింది. బహుశా యశోద సినిమా ప్రచారానికి ఆమె హాజరు కాకపోవచ్చు. అది పలు అనుమానాలకు దారి తీయొచ్చు. అందుకే సమంత ఓపెన్ గా ఈ క్లారిటీ ఇచ్చి వుండోచ్చు.
మయోసిటిస్ అనేది నయం అయ్యే వ్యాధేనా అంటే కాస్త అనుమానమే అని తెలుస్తోంది. కానీ కాస్త సమయం పడుతుందని, మెడికల్ మేనేజ్ మెంట్ ద్వారా మెలమెల్లగా తగ్గుముఖం పట్టించవచ్చని తెలుస్తోంది. మనిషి కదలికలకు సహకరించే కండరాలకు ఇన్ ఫ్లామేషన్ రావడం వల్ల వచ్చే ఇబ్బందులే ఇవి. దీని వల్ల మనిషి చాలా నీరసంగా వుంటారు. నడవడం, కదలికలు కాస్త కష్టం అవుతాయి.
మరి ఇంతకీ సమంతకు సోకినది ఏ తరహా మయోసిటీస్ అన్నది తెలియాల్సి వుంది. పెళ్లి విఫలం అయిన దగ్గర నుంచి సమంత పరిస్థితి ఏమంత బాగా లేదు. విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఈ సమస్య. చూస్తుంటే సమంత టైమ్ అంత బాగా వున్నట్లు లేదు.