అందర్నీ భయ్యా భయ్యా అని పిలుస్తుంటాడు సప్తగిరి. అందుకే అతడ్ని కూడా అంతా ముద్దుగా భయ్యా అని పిలుస్తుంటారు. తెరపైనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఈ భయ్యా కాస్త ఓవరాక్షన్ చేస్తుంటాడు. అయితే ఓ వేదికపై సప్తగిరి మాట్లాడిన మాటలు మాత్రం అతడి ఓవరాక్షన్ కు పరాకాష్టగా నిలిచాయి.
తెనాలి రామకృష్ణ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడాడు సప్తగిరి. సినిమా గురించి తక్కువగా, తన గురించి ఎక్కువగా చెప్పుకున్నాడు. పోనీలే సరదాగా ఉన్నాడని అంతా సరిపెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా కమెడియన్ గా తను రీఎంట్రీ ఇచ్చానని ఏవేవో చెప్పుకొచ్చాడు.
హీరోగా చాలా సినిమాలు చేశానని, ప్రేక్షకులు ఆదరించారని, మళ్లీ కామెడీ చేయమని చాలామంది ప్రేక్షకులు డిమాండ్ చేశారని, అందుకే తెనాలి రామకృష్ణలో కామెడీ క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చాడు.
అలా తెనాలి రామకృష్ణను తనకుతానుగా రీఎంట్రీ మూవీగా చెప్పుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ తనను హీరోగా ఆదరించిన ప్రేక్షకులకు శతకోటి వందనాలంటూ సప్తగిరి మాట్లాడ్డమే పెద్ద కామెడీగా మారింది. నిజంగా అంతలా ఆదరిస్తే, ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వడం ఎందుకో?
సాధారణంగానే కాస్త అతిగా మాట్లాడుతుంటాడు సప్తగిరి. ఈ ఫంక్షన్ లో ఇంకాస్త ఎక్కువగా మాట్లాడాడు. దీనికితోడు ఫంక్షన్ లో తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని “ఏంట్రా.. ఏంట్రా..” అంటూ గద్దించడం మరో కొసమెరుపు.