ఒకవైపు సినీఇండస్ట్రీలో ఏదో రకంగా కొనసాగుతూ.. మరోవైపు సినీ నిర్మాణ రంగంలోంకి ఎంటర్ కావడం.. ఇది దశాబ్దాల నుంచి జరుగుతున్న వ్యవహారమే. ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైల్లోనే ఇలాంటి పని మొదలైంది. ముందుగా నటించడం ద్వారానో, దర్శకత్వం ద్వారానో స్టార్‌డమ్‌ను పొంది, ఆర్థికంగా సెటిల్ అయ్యాకా… సొంతంగా నిర్మాతలుగా మారినవారు ఎంతోమంది ఉన్నారు. బాలీవుడ్‌లో అయినా, టాలీవుడ్ వరకూ అయినా అదే తీరే కనిపిస్తుంది. ఒకరుకాదు ఇద్దరు కాదు.. అనేకమంది నాటితారలు బడా ప్రొడక్షన్ హౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. తెలుగునాట అయితే చాలామంది స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులు కూడా నిర్మాతలుగా మారిన దాఖలాలు బోలెడన్ని ఉన్నాయి.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు.. వంటి హీరోలంతా సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌లను నడిపిన వారే. వారి వారసులు వాటిని కొనసాగిస్తున్న దాఖలాలున్నాయి. ఆ తర్వాత చిరంజీవి, మోహన్ బాబులు కూడా ప్రొడక్షన్ హౌస్‌లను తమ వారితోనో, తామేనో నడిపించారు. నడిపిస్తున్నారు. కొంతమంది హీరోలు తమ తండ్రుల నటనా వారసత్వాన్ని తీసుకోవడంతో పాటు వారి నిర్మాణ వారసత్వాన్ని కూడా తీసుకున్నారు. ఇండస్ట్రీలో కేవలం నిర్మాతలుగా వ్యవహరించిన వారు ఎంతమంది ఇన్ని దశాబ్దాల పాటు తమ కెరీర్‌లను కొనసాగించారో చెప్పలేం కానీ, స్టార్ హీరోలకు మాత్రం నిర్మాణం కష్టంకాలేదు.
వారు పదుల కొద్దీ సినిమాలను రూపొందించారు. అన్నపూర్ణ బ్యానర్‌పై నాగేశ్వరరావు తనే హీరోగా బోలెడన్ని సినిమాలను రూపొందించారు. చిరంజీవి తన తమ్ముడు నాగబాబును నిర్మాతగా కూర్చోబెట్టి కొన్ని సినిమాలు చేశారు. ఇక కృష్ణ పద్మాలయ బ్యానర్‌పై అనేక భారీ సినిమాలను రూపొందించిన చరిత్రను కలిగి ఉన్నారు. కేవలం స్టార్ హీరోలు మాత్రమేకాదు.. నాటి కేరక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్లు కూడా సినీ నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యారు. గిరిబాబు కూడా కొన్ని సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించారు.
హాస్యనటుడిగా వెలిగిన సుధాకర్ సినీ నిర్మాణంలో ఒక చేయి వేశారు. అయితే నిర్మాణం అనేది హీరోలకే బాగా కలిసివచ్చిన అంశం. మిగతావారు మాత్రం అంత దూకుడుగా కొనసాగలేకపోయారు. ఇక ఇప్పటి స్టార్ హీరోలకు కూడా సొంతంగా బ్యానర్లున్నాయి. కొందరికి వారసత్వంగా వచ్చాయి. మరికొందరు సొంతంగా సృష్టించుకున్నారు. నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్.. వీళ్లందరికీ హోం బ్యానర్లున్నాయి. రామ్‌చరణ్ కొత్తగా సృష్టించుకున్నారు. అల్లుఅర్జున్ కూడా అదే బాణీలో సాగుతూ ఉన్నారు. మోహన్ బాబు సంతానం కూడా నిర్మాతలుగా పలు ప్రయత్నాలు సాగించారు.
ఇక బాలకృష్ణ కూడా తండ్రి బయోపిక్ కోసం నిర్మాతగా మారారు. వీళ్లంతా దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వాళ్లు. సొంతంగా ఇమేజ్‌ను సృష్టించుకున్న వారు. బడా సినీ ఫ్యామిలీలుగా సెట్ అయినవాళ్లు. వారందరి గురించి ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. అయితే ఇప్పుడు యంగర్ జనరేషన్ హీరోలు, ఎలాంటి సినీ బ్యాకప్ లేకుండా ఎదిగి వచ్చినవారు కూడా నిర్మాతలుగా మారారు. మారుతూ ఉన్నారు. ఈతరం వారు మరీ జోష్ మీద ఉండటం గమనార్హం. రెండుమూడు సినిమాలు చేసినవారే ఇప్పుడు వేరే వాళ్ల కోసం కూడా ప్రొడ్యూసర్లుగా మారుతూ ఉన్నారు. వాళ్లు డబ్బే పెడుతున్నారా, లేక కేవలం బ్రాండింగ్‌ను మాత్రమే సేలబుల్‌గా మారుస్తున్నారో చెప్పలేం కానీ, నిర్మాతలుగా అడుగేసేవాళ్ల జాబితా క్రమంగా పెరుగుతూ ఉంది.
దాదాపు పదిహేనేళ్ల కిందటే దర్శకుడు తేజ నిర్మాతగా మారి వేరే వాళ్ల దర్శకత్వంలో సినిమలు రూపొందించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకటీ రెండు ప్రయత్నాలకే తేజ చేతులు కాలాయి. దీంతో ఆయన ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇక తమ కాన్సెప్ట్‌పై నమ్మకాన్ని కలిగి, బయటి ప్రొడ్యూసర్లు కలిసి రాకపోవడంతో తొలి సినిమాలతోనే నిర్మాతలుగా మారిన వారూ ఉన్నారు. వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. తన తొలి సినిమాలకు దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. అలా వచ్చినవే 'డాలర్ డ్రీమ్స్', 'ఆనంద్' వంటి సినిమాలు.
ఆ తర్వాత 'హ్యాపీడేస్'ను కూడా ఆయన 'అమిగోస్ ప్రొడక్షన్స్'పైనే రూపొందించారు. కేవలం అదేరీతిన తొలి సినిమాతోనే హోం బ్యానర్‌ను సృష్టించుకున్నాడు సందీప్‌రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి' సినిమాను ఆయన వాళ్లింట్లో వాళ్ల పెట్టబడితోనే రూపొందించి సంచలన విజయాన్ని సమోదు చేశాడు. బాలీవుడ్‌లో కూడా ఆ సినిమా రీమేక్ అయ్యి, మరింత సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిజంగానే కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే.. సినీ నిర్మాణంలో ఎలాంటి అనుభవం లేకపోయినా తొలి ప్రయత్నంలోనే పెట్టుబడి పెట్టి, డబ్బులు చేసుకోవచ్చని శేఖర్ కమ్ముల, సందీప్‌రెడ్డిలు సాధించి చూపించారు.
ఇక నటన విషయంలో ఎంతోకొంత గుర్తింపు రాగానే నిర్మాణంలోకి దూకినవారు ఈ జనరేషన్‌లోనూ కొందరున్నారు. ఇప్పుడు హీరో నాని అదే కోవకే చెందుతాడు. కొన్నేళ్ల కిందటే 'ఢీ ఫర్ దోపిడీ' అనే సినిమాకు కొంత పెట్టుబడి పెట్టి ప్రమోట్ చేశాడు నాని. ఆ సినిమాలో అతడు నటించలేదు. అయితే అదొక డబ్బా సినిమా. ప్రేక్షకుల నుంచి పూర్తిగా తిరస్కారాన్ని పొందింది. ఈ క్రమంలో రూటు మార్చి.. కొన్నేళ్ల విరామం అనంతరం నాని 'అ!' సినిమాను రూపొందించాడు. అది తక్కువ బడ్జెట్‌తో రూపొందించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఊపులో 'హిట్' అంటూ మరో సినిమాతో నిర్మాతగా వస్తున్నాడు నాని.
కేవలం నాని మాత్రమేకాదు… తక్కువ సినిమాలే చేసినా ప్రొడక్షన్ వైపు అడుగులు వేసిన వారిలో విజయ్ దేవరకొండ కూడా చేరాడు. 'అర్జున్ రెడ్డి' తర్వాత ఇతడి దశ తిరిగిపోయింది. ఈ క్రమంలో 'మీకు మాత్రమే చెప్తా' అంటూ విజయ్ దేవరకొండ నిర్మాతగా తన తొలి సినిమా గురించి ప్రకటించాడు. అలాగే నిర్మాతగా మారుతున్న మరో యంగర్ జనరేషన్ ఫిల్మ్‌మేకర్ నాగ్‌అశ్విన్. 'మహానటి' సినిమాతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నిర్మాతగా మారాడు. 'జాతిరత్నాలు' పేరుతో ఒక సినిమా రూపొందుతూ ఉంది.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టిలు హీరోలుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. కేవలం దర్శకత్వంతోనే కాకుండా నాగ్‌అశ్విన్ నిర్మాతగా కూడా మారుతున్నాడు. నాగ్‌అశ్విన్ భార్య కూడా నిర్మాతే అని వేరే చెప్పనక్కర్లేదు. గతంలో కొంతమంది హీరోయిన్లు కూడా సినీ నిర్మాణం చేపట్టారు. జయసుధ నిర్మాతగా పలు సినిమాలు వచ్చాయి. కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఆమె ఆగిపోయారు. ఇక ఈతరం హీరోయిన్లు కూడా నిర్మాతలుగా ఒక చేయి వేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.
అయితే హీరోయిన్లకు అంత సేఫ్ బెట్‌గా కనిపించడం లేదు సినీ నిర్మాణం. ఇదివరకే భూమిక చేతులు కాల్చుకుంది. ఇక ఇప్పుడు కాజల్, రకుల్‌ప్రీత్ లాంటి వాళ్లకు కూడా ప్రొడక్షన్ పట్ల ఆసక్తిని కలిగి ఉన్నట్టుగా ప్రకటనలు వచ్చాయి.