సినిమా తారలు అందంగా కనిపించడానికి ముక్కూమొహాకృతులు మార్చుకోవడం కొత్తేమీ కాదు. దశాబ్దాల కిందే ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే తారలు అధికారికంగా తాము చేయించుకున్న ఆపరేషన్లను ధ్రువీకరించే వారు కాదు! అయితే మీడియాలో మాత్రం అలాంటి విషయాలు గాసిప్స్ గా వచ్చేవి.
అయితే గత దశాబ్దం, దశాబ్దన్నర కాలాల్లో.. హీరోలు కూడా ముఖాకృతులను మార్చుకోవడానికి సర్జరీలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి స్టార్ హీరోల వారసులు హీరోలుగా నిలవడానికి సర్జరీలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నారు. వారి ముక్కులూ, మొహాలు మారిపోవడంతో.. తొలి సినిమాకూ, ఇప్పటికీ వారు చేయించుకున్న సర్జరీల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది.
హీరోల విషయంలో సర్జరీల గురించి ఎవ్వరూ బయటకు మాట్లాడరు. మీడియా కూడా రాయదు! టాలీవుడ్ లో ఇలాంటి హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే వారి గురించి మీడియా మాటైనా రాయదు! వారి విషయంలో వేరే వాళ్లు ఇలా స్పందిస్తే.. వాళ్ల సంబంధీకులు విరుచుకుపడతారు! దవడలు, ముక్కులూ మొహాలకు మాట్లు వేయించుకున్నారని.. ఎవరైనా అంటే వారిపై విరుచుకుపడతారు. ఇక అభిమానులు అయితే మరింతగా రెచ్చిపోతారు.
అయితే హీరోయిన్ల ఆపరేషన్లు మాత్రం చర్చలో ఉంటాయి. మీడియా కూడా హీరోయిన్లపై రాస్తుంది. ఫలానా హీరోయిన్ ముక్కు సర్జరీ చేయించుకుందంటూ లెక్కలేనన్ని కథనాలు వస్తుంటాయి. హీరోల విషయంలో రాతలుండవు. హీరోయిన్లపై రాతలు ఈజీ.
మరి ఇలాంటి వాటితోనే అలసిపోయిందేమో కానీ.. నటి శృతి హాసన్, నా ముక్కు నా ఇష్టం, నేను సర్జరీ చేయించుకున్నాను.. నన్ను అందంగా మార్చుకోవడానికి ఇలా చేయించుకుంటే.. మీకు ప్రాబ్లమ్ ఏమిటి? అంటూ ఎదురు ప్రశ్నించింది. కెరీర్ ఆరంభంలోనే శృతి ఇలాంటి సర్జరీ చేయించుకుంది. అందంగా మారింది. అప్పటి నుంచి సర్జరీ చేయించుకున్న తారల జాబితాలో ఈమెపేరును ప్రస్తావిస్తూనే ఉంటారంతా.
సర్జరీలు చేయించుకున్న హీరోల జాబితాను ఎవ్వరూ రాయరు. హీరోయిన్లను మాత్రం నిత్యం స్మరిస్తూ ఉంటారు ఈ విషయంలో. దీన్ని ఖండించడం లేదు శృతి. నా ఫేస్ నా ఇష్టం అని ధైర్యంగానే స్పందించింది.