చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుతుంది శృతిహాసన్. తన వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సమస్యలతో పాటు కెరీర్ పై పలుమార్లు ఓపెన్ గా మాట్లాడింది. ఇప్పుడు మరో బోల్డ్ స్టేట్ మెంట్ తో ముందుకొచ్చింది. శృతిహాసన్ అభిప్రాయం ప్రకారం.. చాలామంది హీరోలకు కొత్తగా ప్రయత్నించే దమ్ము లేదు.
“చాలామంది యాక్టర్లకు ఏదో కొత్తగా చేయాలని ఉంది. కానీ వాళ్లు అలా చేయలేరు. ఎందుకంటే వాళ్లకు అంత దమ్ము ఉండదు లేదా అలాంటి అవకాశం వచ్చి ఉండదు. అందుకే నా తండ్రి కమల్ హాసన్ చాలా డిఫరెంట్ అని చెబుతాను. మిగతా నటులతో పోల్చి చూస్తే, ఆయన కథల ఎంపిక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ధైర్యం చాలామందికి లేదు.”
ఇలా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. తన తల్లి సారిక కెరీర్ ను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన తల్లి ఉన్నట్టయితే, ఆమె కెరీర్ మరో రకంగా ఉండేదని అభిప్రాయపడింది. ఆమె చాలా ధైర్యవంతురాలని అంటోంది.
ఇక తన కెరీర్ పై స్పందిస్తూ.. సినిమాలతో పాటు మ్యూజిక్ కూడా చేస్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడివి శేష్ సరసన డెకాయిట్ అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు.. చెన్నై స్టోరీ, సలార్ పార్ట్-2 కూడా ఉన్నాయి.