చిరంజీవి నటించిన సైరా సినిమా టీజర్ కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆచార్య టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చింది. అప్పటికీ ఇప్పటికే తేడా ఏంటంటే.. పవన్ కు సైరాతో సంబంధం లేదు. చరణ్ కు మాత్రం ఆచార్యతో బోలెడంత కనెక్షన్ ఉంది.
ఈ సినిమాలో సిద్ధ అనే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు రామ్ చరణ్. ఇక టైటిల్ రోల్ ఆచార్యలో చిరంజీవి కనిపిస్తున్నాడు. అలా ఆచార్య పాత్రకు సిద్ధ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయింది. అయితే ఇది కేవలం టీజర్ కు మాత్రమే పరిమితం కాదు. సినిమాలో కూడా చిరంజీవికి చరణ్ వాయిస్ తో అదిరిపోయే ఎలివేషన్ ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల.
ఇక టీజర్ విషయానికొస్తే.. ఆచార్యతో వింటేజ్ మెగాస్టార్ ను ఆవిష్కరించాడు కొరటాల. చిరంజీవి లుక్ చాలా బాగుంది. అయితే డైలాగ్ విషయానికొచ్చేసరికి మాత్రం చిరంజీవిని తన దారిలోకి తెచ్చుకున్నాడు దర్శకుడు.
కొరటాల సినిమాల్లో హీరో బీభత్సంగా అరవడు. ఎక్కువగా ఊగిపోడు. లో-టోన్ లోనే డైలాగ్స్ చెబుతాడు. ఆచార్యలో కూడా చిరంజీవితో తన స్టయిల్ లోనే డైలాగ్స్ చెప్పించుకున్నాడనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్ లో విజువల్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
ఈ ఒక్క టీజర్ తో ఆచార్యపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఈ వేసవికి (బహుశా మే 7) థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.