సిద్దార్థ్ అంతే. ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తాడు. తనకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని ఓపెన్ గా అంగీకరిస్తున్నాడు. పదేళ్లలో మూడంటే మూడే అవకాశాలొచ్చాయని కూడా అన్నాడు.
“2013 నుంచి 2023 వరకు నాకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కేవలం 3 స్క్రిప్టులు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి మహాసముద్రం. నేను తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకు సమాధానం ఇదే. నేను నటుడ్ని, నా దగ్గరకు ఓ డైరక్టర్ వచ్చి, ఓ మంచి కథ చెబితే నేను ప్రాణం పోస్తాను. అసలు నాకు కథలే చెప్పకపోతే ఎలా? తెలుగు నుంచి ఎవ్వరూ రాలేదు. అందుకే నేనే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేసి, నేనే నటించి, నేనే ప్రాణం పోసి మీ ముందుకొచ్చాను. అదే చిన్నా సినిమా.”
ఇండస్ట్రీ తనను తొక్కేసిందనే కామెంట్ ను తిప్పికొట్టాడు సిద్దార్థ్. తొక్కేయడానికి వాళ్లు ఎవరు అని ప్రశ్నించాడు. తొక్కించుకోవడానికి తను ఎవ్వరి కాళ్ల కింద లేనన్నాడు. టాలీవుడ్ లో కొంతమంది తనను గౌరవించలేదని, ఆదరించలేదని విమర్శించాడు.
చిన్నా సినిమా తీసిన తర్వాత తెలుగులో రిలీజ్ కోసం కొంతమంది నిర్మాతల్ని సంప్రదించాడట సిద్దార్థ్. ఒక నిర్మాత అయితే, ఇతడ్ని కావాలనే గేటు బయట నిలబెట్టాడట. మరో నిర్మాతైతే, సిద్దార్థ్ సినిమాల్ని ఈకాలం ఎవరు చూస్తారని ఎద్దేవా చేశాడంట. ఇలాంటి ఘటనలు కొన్ని తనను బాగా డిస్టర్బ్ చేశాయని అన్నాడు సిద్దార్థ్.
చిన్నా సినిమాను తన కమ్ బ్యాక్ మూవీగా చెప్పడానికి ఇష్టపడలేదు సిద్దార్థ్. టాలీవుడ్ నుంచి బయటకెళ్లిపోతే కమ్ బ్యాక్ అనాలని, తను ఎప్పుడూ టాలీవుడ్ లోనే ఉన్నానని, తనతో సినిమాలు తీయకపోతే, తనే సినిమాలు తీసుకుంటానని అంటున్నాడు. చిన్నా సినిమాతో ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సిద్దార్థ్.. తన జీవితంలో ఇంతకంటే బెటర్ సినిమా తీయలేనని అంటున్నాడు.