అర్జున్ సురవరం సినిమా వరుసగా వాయిదా పడడంపై హీరో నిఖిల్ మరోసారి రియాక్ట్ అయ్యాడు. అంతా అనుకుంటున్నట్టు ఇది ఆర్థిక కష్టాల వల్ల వాయిదా పడలేదని, చాలా సిల్లీ రీజన్స్ వల్ల వాయిదా పడతూ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ “సిల్లీ రీజన్స్” ఏంటనేది మాత్రం చెప్పలేదు.
“కొన్ని సినిమాలకు కష్టాలు తప్పవు. అర్జున్ సురవరానికి కూడా అలాంటి కష్టాలే. కాకపోతే అంతా అనుకుంటున్నట్టు ఆర్థిక కష్టాలు కావు. చిన్న చిన్న అడ్డంకులంతే. ఇంకా చెప్పాలంటే చాలా సిల్లీ రీజన్స్ వల్ల వాయిదాపడింది. మా సినిమాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. చాలా పెద్ద మొత్తానికి మూవీ అమ్ముడుపోయింది. శాటిలైట్ కూడా అమ్ముడుపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సినిమా వాయిదాపడింది.”
అర్జున్ సురవరం రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎక్కువగా మార్పులు చేయాల్సిన అవసరం రాలేదంటున్నాడు నిఖిల్. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకున్నామని, రీమేక్ అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగదని చెబుతున్నాడు.
“ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ పాయింట్. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అంతా ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్యకు అర్జున్ సురవరం ఎలాంటి పరిష్కారం అందించాడనేది సినిమా. మంచి స్క్రీన్ ప్లే ఉంది. అందరి క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఉంది. ఇలాంటి కథ నాకు దొరకడం నా అదృష్టం.”
ఈసారి సినిమా వాయిదాపడే ప్రసక్తి లేదంటున్నాడు నిఖిల్. ప్రచారం స్టార్ట్ చేశామని, థియేటర్లు లాక్ చేశాని, చాలా ప్రాంతాల్లో టిక్కెట్ల బుకింగ్ కూడా మొదలైందని స్పష్టంచేశాడు. ఈసారి తప్పకుండా థియేటర్లలోకి వస్తామంటున్నాడు.