బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా అలియాభట్ కూడా రణబీర్ కపూర్ ను పెళ్లాడింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరబోతోంది. ఆమె సోనాక్షి సిన్హా.
అవును.. సోనాక్షి కూడా పెళ్లికి సిద్ధమైంది. తాజాగా ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. తన నిశ్చితార్థం ఉంగరాన్ని చూపిస్తూ ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. అయితే ఆ ఫొటోల్లో తన కాబోయే భర్తను మాత్రం చూపించలేదు. అతడు ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లోనే ఉంచిందామె.
“నాకు ఇది చాలా పెద్ద రోజు. నా అతి పెద్ద కోరిక నెరవేరిన రోజు. ఇది మీతో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇంత ఈజీగా ఇది అయిపోతుందని కూడా అనుకోలేదు.” ఇలా తన ఎంగేజ్ మెంట్ మేటర్ ను బయటపెట్టింది సోనాక్షి. ఆమె చేతికి డైమండ్ రింగ్ ఉంది.
కొన్నాళ్లుగా నటుడు జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉంది సోనాక్షి. ఇప్పుడు అతడ్నే పెళ్లి చేసుకోబోతోంది. మరో ముఖ్యమైన సందర్భం చూసుకొని, అతడితో ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని ఆమె బయటపెట్టబోతోంది.
సోనాక్షి, జహీర్ ఇద్దరూ, సల్మాన్ సినిమాలతోనే కెరీర్ ప్రారంభించారు. దబంగ్ సినిమాతో సోనాక్షి హీరోయిన్ గా మారగా.. నోట్ బుక్ ప్రాజెక్టుతో జహీర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి డబుల్ ఎక్స్ఎల్ అనే సినిమా చేశారు. ఈ ఏడాదిలోనే అది విడుదలవుతుంది.