బాలీవుడ్ తారలు సౌత్ సినిమాల రీమేక్ లతో యమ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ను సౌత్ సినిమాలు, సౌత్ మూవీ మేకర్లు డ్యామినేట్ చేస్తూ ఉన్నారు. అక్కడి ప్రధాన తారలంతా ఏదో విధంగా ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలతో అనుబంధాన్ని కలిగి ఉండటం గమనార్హం.
అయితే సౌత్ సినిమాలు రీమేక్ లు, లేకపోతే సౌత్ సినిమాల్లో వారే డైరెక్టుగా నటించేయడం, అదీ కాకపోతే.. సౌత్ మూవీ మేకర్లతో బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఉండటం! ఇలా సౌత్ సినిమా చుట్టూ బాలీవుడ్ ప్రదక్షిణలు చేస్తూ ఉంది. బాలీవుడ్ మూవీ మేకర్లు సౌత్ సినిమాలను చూసి పాఠాలు నేర్చుకోవాలంటూ అక్కడి మీడియా చెబుతూ ఉంటే.. బాలీవుడ్ స్టార్లు మాత్రం డైరెక్టుగా సౌత్ సినిమాలతో అనుబంధం పెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో విక్రమ్ వేదా సినిమా హిందీ రీమేక్ అదే పేరుతో వార్తల్లో ఉందిప్పుడు. ఇక ఇటీవలి కాలంలోనే.. పలు సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి విడుదలయ్యాయి. తెలుగు, తమిళ, మలయాళీ సినిమాలు ఈ పరంపరలో కొనసాగుతూ ఉన్నాయి.
ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న సౌత్ సినిమాల్లో అల వైకుంఠపురంలో.. హిందీ రీమేక్ తో పాటు పలు సినిమాలున్నాయి. దీంతో పాటు.. విజయ్ తమిళ సినిమా *మాస్టర్* ను సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ అవుతోంది. దృశ్యం 2 వచ్చే నెలలో విడుదల కాబోతోంది. అపరిచితుడు రీమేక్ సెట్స్ మీద కొనసాగుతూ ఉంది. అలాగే మలయాళీ సినిమా హెలెన్ ను రీమేక్ చేస్తోంది జాన్వీ కపూర్. ఇటీవలే నయనతార సినిమా కొలమావు కోకిల సినిమా జాన్వీ ప్రధాన పాత్రలో రీమేక్ అయ్యింది. ఇప్పుడు మలయాళీ సినిమాన ఎంచుకుంది శ్రీదేవి కూతురు.
ఇంకా అక్షయ్ కుమార్ హీరోగా సూరారై పొట్రు రీమేక్ అవుతోంది. మలయాళీ సినిమా ది గ్రేట్ ఇండియా కిచెన్ కూడా హిందీలో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. మలయాళీ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ హిందీలో సెల్ఫీ పేరుతో రీమేక్ అవుతోంది. అయ్యప్పనుమ్ కోషియుం కూడా ఇదే వరసలో ఉంది. అలాగే కన్నడ సినిమా యూటర్న్ కూడా హిందీలో రీమేక్ అవుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందింది. ఇప్పుడు హిందీ వంతు వచ్చింది.
ఇలా సెట్స్ మీద పలు సౌత్ రీమేక్ లు హిందీలో తెరకెక్కుతున్నాయి. ఒకవైపు స్ట్రైట్ సినిమాల హడావుడి ఉన్నా.. ఇలా రీమేక్ సినిమాలు కూడా హిందీలో రాజ్యమేలుతున్నాయి.