ఎన్నికలు పూర్తయ్యాయి. జనం దృష్టి ఇంకా సినిమాల మీదకు మళ్ల లేదు. క్రికెట్, ఎన్నికల కౌంటింగ్ ఇవన్నీ కీలకంగా వున్నాయి. సినిమాల నిర్మాణం మాత్రం సాగుతోంది. దాదాపుగా ఏ హీరో కూడా చేతిలో సినిమా లేకుండా లేరు. ఆరుగురు హీరోలు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నారు. కానీ టాలీవుడ్ పరిస్థితి మాత్రం ఏమంత ఆశాజనకంగా లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి ముచ్చటగా మూడే కారణాలు ఒకటి రెమ్యూనిరేషన్లు, నిర్మాణ వ్యయాలు తగ్గకపోవడం. థియేటర్లలో చిన్న, మీడియం సినిమాలకు ఆదరణ తగ్గడం, మూడు డిజిటల్ అమ్మకాలు మందగించడం. హీరోలు రెమ్యూనిరేషన్ల విషయంలో అస్సలు తగ్గడం లేదు. రెండు కోట్ల లోపు హీరో అన్న వారు లేరు ఇప్పుడు. మూడు కోట్ల నుంచి ముఫై కోట్ల వరకు చిన్న, మిడ్ రేంజ్ హీరోలు పలుకుతున్నారు. కానీ మూడు కోట్ల హీరోకి ఆంధ్ర, తెలంగాణ కలిపినా మూడు కోట్ల థియేటర్ మార్కెట్ వుండడం లేదు. కానీ ఖర్చు పన్నెండు నుంచి పదిహేను కోట్లు అవుతోంది. అంటే మిగిలిన పది కోట్లు నాన్ థియేటర్ మీద నుంచి రాబట్టడం సాధ్యమా?
ఇలాంటి టైమ్ లో ఆశ ఒక్కటే సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. చిన్న సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ లాభాల కిక్కే వేరు. కానీ అలాంటి అవకాశం పాతిక సినిమాల్లో ఒక్కదానికి దక్కుతుంది. ఎప్పుడో ఒకసారి వస్తాయి జాతిరత్నాలు, బేబీ, టిల్లు ఇలా.. కానీ అన్ని సార్లు లాటరీ తగలదు. గత ఏడాది కాలంలో 99శాతం చిన్న మీడియం సినిమాలు నష్టాలు చవిచూసినవే. నిర్మాతలు కక్కలేక, మింగలేక గొంతులో దిగమింగుకున్న సినిమాలే.
ఖాళీగా వుండలేక, మరో వ్యాపారం చేయలేక దొరికిన హీరోతో సినిమా నిర్మాణానికి దిగుతున్నారు. కానీ ఆ హీరోలకు మార్కెట్ అంతంత మాత్రంగా వుంటోంది. రెమ్యూనిరేషన్లు ఓ లెక్కలో వుంటున్నాయి. వరుస ఫ్లాపుల సీనియర్ హీరో కూడా పాతిక కోట్లకు తగ్గడం లేదు. మిడ్ రేంజ్ హీరో పది కోట్లకు తగ్గడం లేదు. అయినా సినిమాలు తీస్తున్నారు, కోట్లకు కోట్లు నష్టపోతున్నారు. ఎందుకో అన్నది అర్థం కాదు ఎవరికీ. ఏదో ఆశ.. కొట్టకపోతామా అన్న ఆశ.
కోటి నుంచి పదమూడు కోట్ల రేంజ్ హీరోలు దాదాపు పది మంది వరకు వున్నారు. వీరిలో తొంభై శాతం మంది కెరీర్ కు ఈ ఏడాది తరువాత బ్రేక్ పడిపోతుందని ఓ అంచనా. ఇప్పటికే ఆరుగురు హీరోలు ఇళ్లలో కూర్చున్నారు. పది కోట్లు తీసుకునే హీరోతో దాదాపు పూర్తి అయిన ప్రాజెక్ట్ అమ్మకాలు జరగక డేట్ వేయకుండా అలా వుంది.
ఒకప్పుడు హిందీ రేట్ వుంది అనే మాటతో సినిమాలు చేసి, చాలా మంది నిర్మాతలను కుదేలు చేసిన హీరోతో రెండు మూడు సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. అందులో ఒకటి నత్త నడక నడుస్తోంది. ఓ సీనియర్ హీరో సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. కానీ ఏ అమ్మకాలు జరగక డేట్ విషయం తేలడం లేదు. ఒక చిన్న హీరో తనకు కెజిఎఫ్ లెవెల్ కథ వుంటేనే చేస్తాను అంటూ ఖాళీగా కూర్చున్నారు. ఓ హీరో బంధువుతో సినిమాలు చేస్తున్నారు, చేసిన ప్రతి ఒక్కరికీ నష్టాలే. ఇక అతగాడి జర్నీ దాదాపు ఆగిపోయినట్లే అని టాక్ వినిపిస్తోంది.
నిజానికి ఇప్పుడు జరగాల్సింది కరెక్షన్. హీరోలు అందరికన్నా ముందుగా దిగి రావాలి. రెమ్యూనిరేషన్లు పక్కన పెట్టేయాలి. లాభాల్లో వాటా అనే పద్దతికి రావాలి. లేదా రెమ్యూనిరేషన్లు తగ్గించాలి. ఆ తరువాత క్యారెక్టర్ నటులు కూడా ఇదే దారిలోకి రావాల్సి వుంది. ఆ తరువాత దర్శకులు చాలా ప్లాన్డ్ గా సినిమాలు చేయాలి. నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ను పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. అప్పుడే నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
అలా చేయకుంటే నటులకు డిమాండ్ తగ్గుతుంది. చాలా మంది హీరోలు ఇళ్లలో కూర్చోవాల్సి వస్తుంది. ఆ సమయం ఎంతో దూరంలో లేదన్నది ఇండస్ట్రీలోని అనుభవజ్ఙుల మాట.