చేసింది రీమేక్ సినిమా. ప్రపంచం మొత్తానికి ఆ విషయం తెలుసు. కానీ దాన్ని దాచిపెట్టడానికి యూనిట్ చేస్తున్న ప్రయత్నాలు, పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతుంది. హంట్ సినిమా మేటర్ ఇది.
సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హంట్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో 'ప్రేమిస్తే' భరత్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేశారు. విదేశీ టెక్నీషియన్స్ సహకారంతో 'జాన్ విక్' టైపులో ఫైట్స్ కంపోజ్ చేశారు.
ఇలా రీమేక్ ప్రాజెక్టుకు హైటెక్ హంగులు అద్దే ప్రయత్నం చేసింది యూనిట్. అయితే అంతా బాగానే ఉంది కానీ, రీమేక్ కదా అని అడిగితే మాత్రం సమాధానం దాటేస్తున్నాడు సుధీర్ బాబు.
సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు ఈ హీరో. మలయాళంలో పృధ్వీరాజ్ హీరోగా నటించిన ఓ సినిమాకు ఇది రీమేక్ కదా అనే ప్రశ్నకు సుధీర్ బాబు సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు. ఎన్నో సినిమాలు, మరెన్నో సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొందుతామంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
ఓ మలయాళ సినిమా ఛాయలు ఇందులో కనిపించినప్పటికీ, ఆ కథకు చాలా మార్పులు చేశామంటూ ఓ సందర్భంలో ఓపెన్ అయిపోయాడు సుధీర్ బాబు. అయితే కథకు ఎన్ని మార్పులు చేసినప్పటికీ కీలకమైన క్లయిమాక్స్ విషయంలో మాత్రం మాతృకనే ఫాలో అయ్యారు.
సరిగ్గా ఇక్కడే రిస్క్-టెన్షన్ ఫీల్ అవుతున్నాడు సుధీర్ బాబు. తను ఓ ప్రయోగం చేశానని, దాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలోకి వస్తోంది హంట్ మూవీ.