పుష్ప ఒకటో పార్ట్ ఒక కొలిక్కి వచ్చేసింది. అమేజాన్ లో కూడా ఈ సినిమా విడుదలైపోవడంతో ఈ సినిమా కథ ఒక తీరానికి చేరింది. ఈ సినిమాకు రెండో పార్ట్ ఉందని ప్రకటిస్తూ వచ్చారు రూపకర్తలు. అయితే పుష్ప రెండో పార్ట్ ఎలా ఉంటుంది? అనే తీవ్రమైన చర్చ కానీ, విపరీతమైన ఆసక్తి కానీ ప్రేక్షకగణంలో పెద్దగా లేదు. అల్లు అర్జున్ వీరాభిమానులు కూడా ఫస్ట్ పార్ట్ గురించి పొగుడుకుంటున్నారు కానీ, రెండో పార్ట్ విషయంలో హైప్ ను పెంచే ప్రయత్నాలు ఏమీ లేవు.
మొదటి పార్ట్ ముగింపులో సెకెండ్ ఇంటర్వెల్ అంటూ సుకుమార్ సస్పెన్స్ ను మెయింటెయిన్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఆర్జీవీ వంటి వాళ్లు వాడిన టెక్నిక్కే ఇది. సర్కార్ రాజ్ సినిమా ముగింపులో.. ఛాయ్ తాగిరండి అంటూ వర్మ మూడో పార్ట్ గురించి శుభంకార్డు సమయంలో క్లూ ఇచ్చాడు.
చాలా సంవత్సరాల పాటు వర్మ ఆ మూడో పార్ట్ ను అలాగే పెండింగ్ లో ఉంచాడు. చివరకు ఈ మధ్యనే ఆ మూడో పార్ట్ ముచ్చట ముగిసింది. సర్కార్ రాజ్ ఎండింగ్ లో ఛాయ్ తాగిరండన్న వర్మ, చాలా యేళ్ల తర్వాత సర్కార్ పార్ట్ త్రీ తీసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా రెండో పార్టుగా విభజించడం అనాసక్తికే దారి తీసింది. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఒక పార్ట్ గా , రాజకీయ జీవితాన్ని మరో పార్ట్ గా తీద్దామని.. రెండు పార్టులు ప్రకటించారు. అయితే తొలి పార్ట్ ఆకట్టుకోలేకపోవడంతో.. రెండో పార్ట్ విడుదలైన వ్యవహారాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు!
బాహుబలి లాంటి చందమామ కథ అలా వర్కవుట్ అయ్యింది కానీ, ఈ సోషల్ సినిమాలకు ముందే ప్రకటించిన రెండో పార్ట్ లు అంత వర్కవుట్ కాలేదు ఈ మధ్యకాలంలో. మరి పుష్ప విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. పుష్ప పార్ట్ టూ గురించి దర్శకుడు సుకుమార్ ఐఏఎన్ఎస్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కొంత విశేషంగా ఉంది. పుష్ప పార్ట్ 2 కు సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయ్యిందని సుకుమార్ చెప్పారు. అయితే.. ఇప్పుడు ఆ కంటెంట్ పనికిరాదని ఈ దర్శకుడు అనుకుంటున్నాడట. దాన్నంతా రీ షూట్ చేయాల్సి ఉందని కూడా ఈ దర్శకుడే ప్రకటించుకున్నాడు!
మరి తను తీసిన వెర్షన్ ను తనే మళ్లీ రీ షూట్ చేయాల్సి ఉంటుందని సుకుమార్ చెప్పడం గమనార్హం. మరి దర్శకుడు ఇలా అనుకుంటే.. దీని నిర్మాతలు, హీరో ఏమంటారో!