సురభి నాగేశ్వరరావు (బాబ్జీ) వెళ్లిపోయారు. అందరూ వెళ్లిపోతారు. కొంత మంది తమ గుర్తుల్ని వదిలి వెళ్లిపోతారు. నాటకం అంటే సురభి. సురభి అంటే గుర్తొచ్చేది బాబ్జీ. 76 ఏళ్ల వయసులో అనారోగ్యం తీసుకెళ్లింది. నాటకమే ఊపిరిగా, రంగస్థలమే గుండె చప్పుడుగా జీవించారు. నాటకం ముగిసింది. తెరపడింది. తెలుగు వారి ఆస్తి సురభిలోంచి ఒక వెలుగు ఆరిపోయింది.
పద్యనాటకం మన సంపద, దీపం. శతాబ్ద కాలం నుంచి సురభి ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడింది. చేతులు కాలినా చేజారనివ్వలేదు. సురభిలో ఎందరో కళాకారులు నాటకం కోసమే పుట్టి చనిపోయారు.
దేవకి పాత్ర వేస్తున్న నటి, రంగస్థలం మీదే బిడ్డకు జన్మనివ్వడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఆ బిడ్డ మరుసటి రోజు శ్రీకృష్ణుడిగా స్టేజి మీద ఊయల ఊగడం కూడా జరిగి వుండదు. ఇవన్నీ సురభిలోనే జరుగుతాయి. అలాంటి సురభిని దశాబ్దాలుగా సంరక్షించిన వ్యక్తి బాబ్జీ.
1974లో చిన్నప్పుడు రాయదుర్గంలో మొదటిసారి సురభి నాటకాలు చూశాను. లైటింగ్, వైర్‌ట్రెక్స్ తెలియని రోజులు. నాటకాలు ఒక అంకానికి ఇంకో అంకానికి మధ్య బ్రేక్ ఇచ్చి బోర్ కొట్టిస్తున్న కాలంలో నాన్ స్టాప్‌గా స్క్రీన్స్ మారుతూ నాటకాన్ని నడిపించడం అద్భుతమనిపించింది. ఘటోత్కచుడి నోట్లోకి లడ్డూలు వెళ్లడం స్టేజి మీద జరిగే విచిత్రం.
తర్వాత చాలా సార్లు చూసినా హైదరాబాద్ లలితకళాతోరణంలో చూడడం ఒక అనుభూతి. జర్నలిస్టుగా బాబ్జీ ఇంటర్వ్యూ చేయడం ఒక జ్ఞాపకం. ఆయన ఏం చెప్పారంటే
“మేము పేదవాళ్లం. కానీ రంగస్థలంపై మహారాజులం. నవ్విస్తాం. ఏడిపిస్తాం. రెండు గంటలు వేరే లోకానికి తీసుకెళ్తాం. ఇంతకు మించి ఏం కావాలి. నాటకమే మా పని. మాకు వేరే పనిరాదు. మాకు ఇల్లు లేకపోవచ్చు. కానీ సురభి అనే ఇంటి పేరుంది. ఆస్తులు లేకపోవచ్చు. నాటకమనే సంపద ఉంది. దాన్ని ఎవరూ దోచుకోలేరు”
సురభి అనే పేరులో బాబ్జీ బతికే వుంటారు.
జీఆర్ మహర్షి