దగ్గుబాటి సురేష్ బాబు..టాలీవుడ్ పెద్దల్లో ఒకరు. స్టూడియో అధినేత. రెండు తెలుగు రాష్ఠ్రాల్లో మెజారిటీ థియేటర్లను నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్. నిర్మాత. వగైరా..వగైరా…ఆ ఇంట్లొనే ఇద్దరు హీరోలు వెంకటేష్, రానా కూడా వున్నారు.
గత వారం రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న హడావుడిలో సురేష్ బాబు పేరు ఎక్కడా వినిపించడం లేదు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఆయన కూడా వున్నారు. కానీ బయటకు వస్తున్న వార్తల్లో కానీ, కమిటీల్లో కానీ ఎక్కడా ఆయన పేరు వినిపించడం లేదు. గిల్డ్ సమావేశాలకు ఆయన హాజరయ్యారా లేదా అన్నది కూడా తెలియడం లేదు.
ఇప్పటికే టాలీవుడ్ గిల్డ్..ఛాంబర్ అనే రెండుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఛాంబర్ జనాలు నిర్మాణాల్లో యాక్టివ్ గా లేకపోయినా అఫీషియల్ బాడీగా వున్నారు. ఈ బాడీ నిర్మాణాలు బంద్ చేయడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బాహాటంగానే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సురేష్ బాబు ఎక్కడ వున్నారు..ఎందుకు మౌనంగా వున్నారు అన్నది ప్రశ్న.
నిజానికి నిర్మొహమాటంగా మాట్లాడడం అన్నది సురేష్ బాబు స్టయిల్. కానీ ఆ మాటలే వినిపించడం లేదు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సురేష్ బాబు గిల్డ్ వ్యవహారాలకు దూరంగా వుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ టోటల్ ఎపిసోడ్ ప్రారంభంలో సభ్యుల సంతకాల కోసం గిల్డ్ పంపిన డాక్యుమెంట్ మీద సురేష్ బాబు సంతకం చేయలేదని తెలుస్తోంది. విశేషమేమిటంటే సురేష్ బాబు వ్యాపార భాగస్వామి, సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార భాగస్వామి అయిన ఆసియన్ సునీల్ పేరు కూడా ఎక్కడా ఏ కమిటీలో కనిపించకపోవడం.
మొత్తానికి టాలీవుడ్ ఐక్యతగా వుంది అన్నది కాస్త అనుమానమైన విషయమే.