మరోసారి ‘ఆకాశమే హద్దుగా..’

ఆకాశం నీ హద్దురా.. సూర్య, సుధా కొంగర కాంబినేషన్ లో వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలిసింది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య కొత్త సినిమా ప్రకటన వచ్చింది.…

ఆకాశం నీ హద్దురా.. సూర్య, సుధా కొంగర కాంబినేషన్ లో వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలిసింది. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈసారి మరిన్ని ప్రత్యేకతలతో వచ్చింది వీళ్లిద్దరి కాంబినేషన్.

ఇదొక సిసలైన మల్టీస్టారర్ మూవీ. సినిమాలో సూర్యతో పాటు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడు. సూర్య లాంటి విలక్షణ నటుడికి, దుల్కర్ లాంటి మరో విలక్షణ నటుడు యాడ్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిని ఆకర్షించింది.

సూర్య, దుల్కర్ తో పాటు.. తమన్న బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ, 'అంటే సుందరానికి' ఫేమ్ నజ్రియా కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో గన్స్ కూడా చూపించి, ఈ ప్రాజెక్టులో యాక్షన్ పాళ్లు కూడా ఉంటాయనే విషయాన్ని వెల్లడించారు.

ఆకాశం నీ హద్దురా సినిమాకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్, ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు. జాతీయ ఫిలిం అవార్డుల్లో ఆకాశం నీ హద్దురా సినిమా సంచలనం సృష్టించింది. బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ తో పాటు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో ఈ సినిమా అవార్డులు కొల్లగొట్టింది. ఇలాంటి కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతోంది. ఈసారి ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.