తన సినిమా కెరీర్ కు సంబంధించి ఓ విషయంలో సూర్య గ్యాప్ తీసుకున్నాడు. పోలీస్ పాత్రలు ఇప్పట్లో చేయనని తన దగ్గరకొచ్చిన దర్శకులకు చెప్పేస్తున్నాడు. కొన్నాళ్లు ఖాకీ చొక్కాకు గ్యాప్ ఇస్తానని, ఓ మంచి టైమ్ చూసి మళ్లీ పోలీస్ పాత్రలు రీస్టార్ట్ చేస్తానని అంటున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ బయటపెట్టాడు.
సూర్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన కాక్క కాక్క సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. తర్వాత ఇదే సినిమాను తెలుగులో ఘర్షణ పేరిట వెంకటేష్ రీమేక్ చేశాడు కూడా. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అనిపించింది దర్శకుడికి. అనుకున్నదే తడవుగా ఓ లైన్ రాసుకొని వెళ్లి సూర్యను కలిశాడు.
అప్పుడు సూర్య తన మనసులో ఉన్న మాట బయటపెట్టాడు. కొన్నాళ్ల పాటు పోలీస్ పాత్రలు చేయనని గౌతమ్ మీనన్ కు చెప్పేశాడట. మరీ ముఖ్యంగా “కాక్క కాక్క” లాంటి సినిమా సీక్వెల్ లో ఇప్పట్లో నటించే ఉద్దేశం లేదని క్లియర్ గా చెప్పేశాడు.
చూస్తుంటే.. సూర్యపై సింగం-3 (యముడు-3) ఎఫెక్ట్ బాగానే పడినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత పోలీస్ పాత్రల విషయంలో సూర్య వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు “బందోబస్త్” కూడా ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్లు ఆ తరహా పాత్రలకు గ్యాప్ ఇవ్వాలని సూర్య నిర్ణయించుకున్నట్టు గౌతమ్ మీనన్ తెలిపాడు.