బ్రిటీష్ వారికి భారతీయులు బానిసలుగా బతకాల్సిన అవసరం లేదు, వారిపై తిరగబడవచ్చు, వారిపై తిరగబడాలి.. అనే స్ఫూర్తిని భారతీయుల్లో నింపిన తొట్టతొలి యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ రేనాటి సూర్యుడి జీవిత కథా ఆధారంగా వచ్చిందే 'సైరా నరసింహారెడ్డి' సినిమా. చరిత్ర మరిచిన యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేసింది ఈ సినిమా. ఈ ప్రయత్నం అభినందనీయం. ఆ ప్రశంసలకు అర్హులు 'సైరా నరసింహారెడ్డి' రూపకర్తలు.
స్వతంత్రం రావడానికి వందేళ్లకు ముందే బ్రిటీష్ వారిపై తిరగబడినయోధుడు ఉయ్యాలవాడ. ఆయన వీర మరణం అనంతరం వంద సంవత్సరాలపాటు బ్రిటీష్ వారి పాలనే ఇండియాలో సాగింది. దీంతో ఆయన చరిత్రను అప్పుడే తెరమరుగు అయ్యింది. అయితే ఉయ్యాలవాడ చరిత్రను ఉనికిలో నిలిపారు జానపదులు. ఒక జానపద కథగా, పాటగా ఉయ్యాలవాడ కథ జనబాహుల్యంలో నిలిచింది. రేనాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఆ కథ వారు వినిపిస్తూ వచ్చారు.
సైరా నరసింహారెడ్డి' సినిమాలో మరుగుపరిచిన వాస్తవాలు ఏమిటి, జోడించిన కల్పితాలు ఏమిటి.. అనే విషయాలను తెలుసుకోవాలంటే కొంత పరిశోధనే చేయాలి. అందులో భాగంగా ముందుగా ఉయ్యాలవాడ కథను గ్రంధస్తం చేసిన వ్యక్తిని ప్రస్తావించాలి. ఆయనే తంగిరాల సుబ్బారావు. జానపదుల పాటల్లో వినిపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అధ్యయనం చేశారాయన. కొన్నినెలల పాటు అధ్యయనంతో ఆయన 'రేనాటి సూర్యచంద్రులు' పేరుతో పుస్తకం రచించారు. అందులో ఉయ్యాలవాడను రేనాటి సూర్యుడిగా, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా వెంగళ్ రెడ్డిని రేనాటి చంద్రుడిగా అభివర్ణించారు.
ఇంతకీ రేనాడు అంటే.. ఏమిటంటే.. కుందూనది పరివాహక ప్రాంతాన్నే రేనాడుగా వ్యవహరిస్తారు. తంగిరాల సుబ్బారావు విద్యాధికుడు. యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరులో ఆయన తెలుగుశాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. అనేక పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఆయన పెద్ద పరిశోధనే చేశారు. దశాబ్ధాల కిందటే ఉయ్యాలవాడ నడయాడిన పరిసరాల గురించి ఫొటోలను తీసి తన పుస్తకంలో ప్రచురించారు. జానపదులను కలిసి.. ఉయ్యాలవాడ వీరగాథలు అన్నీ వినీ.. వాటిపై పరిశోధనలు చేసి.. ఆయన ఉయ్యాలవాడ చరిత్రను తొలిసారి గ్రంథస్తం చేశారు.
ఆ తర్వాత కూడా పలువురు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి రాశారు. కర్నూలుకు చెందిన ఎస్డీవీ అజీజ్ 'పాలెగాడు' పేరుతో ఒక నవల రాశారు. ఉయ్యాలవాడ వీరగాథే అది. మరికొందరు కూడా అలాంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపిస్తాయి. ఇక 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి చెప్పాలంటే.. అది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన, కొంత కల్పిత కథనంతో కూడిన సినిమా. ఉయ్యాలవాడకు జీవితంలోని స్ఫూర్తిని చాటుతూనే, అదే సమయంలో కొంత కల్పితం ద్వారా ఆయన జీవితాన్ని కొంత సినిమాటిక్‌గా మార్చారు.
అందులో ముఖ్యమైన అంశాలు.. ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడినవి. ఉయ్యాలవాడకు నిజ జీవితంలో ఇద్దరు భార్యలున్నారు. ఆ నాటికి బహుభార్యత్వం మనదగ్గర సహజమే. కాబట్టి అది ఎవరి దృష్టిలోనూ తప్పుకాదు. సినిమాలోనూ నరసింహారెడ్డికి ఇద్దరు భార్యలు అన్నట్టుగానే చూపినా.. వారి చుట్టూ కొంత కల్పిత కథనాన్ని సృష్టించారు. తద్వారా ఉయ్యాలవాడ వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తగ్గట్టుగా అన్వయించే ప్రయత్నం చేశారు. ఇక ఉయ్యాలవాడ అనేకమంది తన సహచరుల్లో, తన సహచర పాలెగాళ్లలో స్ఫూర్తి నింపింది అయితే నిజం.
ఉయ్యాలవాడ తిరుగుబాటు చేయడంతో అనేకమంది పాలెగాళ్లు, జమీందార్లు, నవాబులు ఆయన వెంట నిలిచారు. ఆయనకు జైకొట్టారు. ఉయ్యాలవాడ సైన్యం తొమ్మిది వేల మందికి చేరింది. ఆ విషయాన్ని సినిమాలో చూపించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకోవడానికి నొస్సం కోటను బ్రిటీషర్లు ముట్టడించడం చరిత్రలో జరిగిన వాస్తవం. వారి బారి నుంచి ఉయ్యాలవాడ దిగ్విజయంగా బయటపడ్డారు. ఆ తర్వాత కోటను ఖాళీ చేశారు. పూర్తిగా ధ్వంసం అయిన ప్రస్తుత నొస్సం కోటను ఇప్పుడు కూడా చూడవచ్చు.
నొస్సం కోట చుట్టూ పెద్దకందకాలు ఉంటాయి. కోటను ఎవరైనా ముట్టడించినా.. కందకం దాటాలి. కందకం నిండా నీళ్లు వదిలి.. అందులో మొసళ్లను వదిలేవారంటారు. సినిమాలో కూడా కందకం కోటను రక్షించే వైనాన్ని బాగా చూపారు. ఆ తర్వాత ఉయ్యాలవాడ యుద్ధ ప్రణాళికలకు వేదిక మారింది. అదే జగన్నాథుని కొండ. ఇది కోవెలకుంట్ల సమీపంలో ఉంటుంది. ఇప్పటికీ అక్కడ ఆలయం ఉంది. ఆ కొండ మీదకు చేరడానికి ఇప్పుడు మంచి దారే ఉంది. దాదాపు రెండు వందల యేళ్ల కిందటి రాళ్ల మెట్లదారిని కూడా మనం గమనించవచ్చు.
జగన్నాథుని కొండ మీద నుంచి చూస్తే.. సుదూరంగా కొన్ని కిలోమీటర్ల దూరాన్ని వీక్షించవచ్చు. బ్రిటీషర్ల సైన్యం ఆ ప్రాంతానికి వచ్చే ప్రయత్నం చేసినా.. దూరం నుంచినే వాళ్లను గమనించే అవకాశం ఉండటంతో ఉయ్యాలవాడ జగన్నాథుని కొండను వేదికగా మార్చుకుని ఉండవచ్చు. ఇది గొప్ప యుద్ధవ్యూహమే.
ఉయ్యాలవాడ వెలిగిన సమయంలో కొందరు పాలెగాళ్లు ఆయనకు సహరించినా, ఆయనపై ఈర్షతో, అసూయతో రగిలిన వాళ్లూ ఉన్నారు. వారినే ఆసరాగా చేసుకుని తమ విభజించు-పాలించు నియమాన్ని అమలు పెట్టారు బ్రిటీషర్లు. ఉయ్యాలవాడ పట్టుబడటానికి కారణం కూడా ఆయన సహచర పాలెగాళ్లలోని వెన్నుపోటే అని చరిత్ర చెబుతూ ఉంది. సినిమాలోనూ అలానే చూపించారు. సినిమాలో చూపిన దాంట్లో కల్పిత విషయాలు ఏమిటంటే.. ఉయ్యాలవాడ ఆర్థిక స్థితి అంటారు పరిశీలకులు. ఉయ్యాలవాడ కుటుంబం పాలెగాళ్లే అయినా, అప్పటికే బ్రిటీష్ వారు అలాంటి వారికి పవర్స్ అన్నీ రద్దుచేశారు. దీంతో అంత వైభవం లేదు.
సినిమా కోసం కొంచెం ఫ్లెక్సిబులిటీ తీసుకున్నట్టున్నారు ఈ విషయంలో. ఇప్పటికీ ఉయ్యాలవాడ సంచరించిన స్థలాలను మనం చూడవచ్చు. అందుకోసం కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, నొస్సం, జగన్నాథుని కొండ తదితర ప్రాంతాలకు వెళ్లాలి. ఆసక్తి ఉన్నవారు ఆ యోధుడి నిజజీవిత స్థలాలను సందర్శించ్చు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత ప్రాంతం వారు ఈ సినిమా పట్ల మిశ్రమ స్పందన వ్యక్తంచేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి దర్శకుడు సురేందర్ రెడ్డి తనకు కావాల్సిన అంశాలను తీసుకుని, మిగిలిన అంశాలను వదిలేశారని వారు అంటున్నారు.
ఆ విషయంలో సురేందర్ రెడ్డిని నిందించడానికి కూడా ఏమీలేదు. ఎందుకంటే.. తీసింది డాక్యుమెంటరీ కాదు, వందల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా. కాబట్టి వ్యాపారాత్మక విలువలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ సినిమాగా రావడం మాత్రం ఆ ప్రాంత వాసులను సంతోషపెడుతూ ఉంది. చరిత్ర మరుగున పడ్డ తమ వీరుడిగాథ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అవుతోందని వారు సంతోషంగా ఉన్నారు. కొంతమందిని సైరా నరసింహారెడ్డి సినిమా పూర్తి కల్పితం అని వాదించేవాళ్లూ లేకపోలేదు. ఆయన దొంగ, దొర.. అంటూ మాట్లాడుతూ ఉంటారు.
అవన్నీ గాలి మాటలే. అందుకు ప్రధానమైన రుజువు.. ఉయ్యాలవాడ సైన్యం. ఆయన వెంట తొమ్మిది వేల మంది సైన్యం ఉందని బ్రిటీష్ రికార్డులే చెబుతున్నాయి. ఆయనకు మరణశిక్ష విధించడమే గాక, ఆయన తలను కోవెలకుంట్ల కోట గోడకు వేలాడదీయాలని కూడా తీర్పును ఇచ్చారు. అలాంటి తీర్పు వచ్చిందంటే.. బ్రిటీష్ వారిని ఉయ్యాలవాడ ఎన్ని ముప్పుతిప్పలు పెట్టారో అర్థం చేసుకోవడం కష్టం ఏమీకాదు.
ఉయ్యాలవాడ తన అధిపత్యం కోసం, తన మనుగడ కోసం తిరుగుబాటు చేసి ఉంటే.. అంతమంది ఆయన వెంట నిలిచే అవకాశాలు లేవు. తొమ్మిది వేలమంది సైన్యం అంటే మాటలుకాదు. అది కూడా తెల్లవారికి వ్యతిరేకంగా! బ్రిటీష్‌వారు అంత కక్ష కట్టారంటే కూడా ఆయన వీరత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.
-జీవన్‌రెడ్డి.బి