పవన్ కల్యాణ్ సినిమా రీ ఎంట్రీని బిగ్ న్యూస్ గా ప్రకటించాడు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్. 'పింక్' రీమేక్ తోనే పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తరణ్ ఆదర్శ్ కన్ఫర్మ్ చేశాడు. గత కొన్నాళ్లుగా ఇందుకు సంబంధించి ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తరణ్ ఆదర్శ్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
కేవలం గాసిప్ లాగా అయితే తరణ్ ట్వీట్ చేసి ఉండకపోవచ్చు. బోనీ కపూర్ నుంచి క్లారిటీ వచ్చాకా తరణ్ ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. బోనీ కపూర్ తెలుగు 'పింక్' నిర్మాణంలో భాగస్వామి కాబోతున్నాడని, దిల్ రాజు నిర్మాణంలో ఆ సినిమా రూపొందుతుందని, శ్రీరామ్ వేణూ ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్టుగా తరణ్ ట్వీట్ చేశాడు.
పవన్ కల్యాణ్ చివరి సరిగా అజ్ఞాతవాసిలో నటించిన వైనాన్ని కూడా తరణ్ ప్రస్తావించాడు. ఇక వెంటనే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఎన్నికలు అలా అయిపోగానే ఇలా సినిమాలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు డ్యామేజ్ కవరేజ్ మొదలుపెట్టారు! పవన్ బీద అరుపులతో సినిమాలు చేస్తున్నాడనే సానుభూతిని వ్యక్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. తమ అభిమాన హీరో అటూ ఇటూ దూకుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు డ్యామేజ్ కవరేజ్ కూడా అంత తేలికగా ఏమీ లేదు!