మెగా హీరోలో థర్డ్ జనరేషన్.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. వైష్ణవ్ తేజ్. సరైన బ్రేక్ కోసం చూస్తూ ముందు వెనుక అవుతున్నారు ముగ్గురూ. అలా అని ఖాతాల్లో హిట్ లు లేవా అంటే వున్నాయి. వరుణ్ కు ఎఫ్ 2, ఎఫ్ 3, ఫిదా లాంటి మంచి సినిమాలు పడ్డాయి. సాయి ధరమ్ కు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ వున్నాయి. అంతకన్నా ముందు మంచి హిట్ లు వున్నాయి. ఫ్లాప్ లు వున్నాయి.
నిజానికి వరుణ్ కన్నా సాయి ధరమ్ కే ఎక్కువ మాస్ హిట్ లు పడ్డాయి. వైష్ణవ్ తేజ్ మాంచి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చారు కానీ తరువాత మరి హిట్ లేదు. పైగా అన్నీ డిజాస్టర్ లే.
ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే వరుణ్ తేజ్ చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. కానీ సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇంకా కొత్త సినిమాలు సెట్ మీదకు తీసుకెళ్లలేదు. విరూపాక్ష తరువాత చాన్స్ ల సమస్య సాయి ధరమ్ కు లేదు. కానీ ఎందుకో సెట్ మీదకు మాత్రం వెళ్లడం లేదు. సితార సంస్థలో గాంజా శంకర్ అనౌన్స్ చేసారు కానీ అలా అలా వెనక్కు. వెళ్తోంది. ఈ నెల మూడొవారంలో షూట్ అన్న వార్తలు వినిపించాయి. కానీ మళ్లీ వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్ల క్రితం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి ఆలస్యం చేసారు సాయి తేజ్. కానీ ఇప్పుడు ఫిట్ గానే వున్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతోందన్నది తెలియదు. వైష్ణవ్ తేజ్ చేతిలో ప్రస్తుతానికి ఏ సినిమా లేదు. నిర్మాతల దృష్టి కూడా అతని వైపు వున్నట్లు లేదు.
ఈ ఏడాది ఈ ముగ్గురు తేజ్ లు మూడు మంచి హిట్ లు కొట్టాలి. లేదూ అంటే మెగా హీరోల హవా రెండో జనరేషన్ వరకే పరిమితం అయిపోతుంది. ఎందుకంటే తరచు కొత్త నెత్తురు ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది. వాళ్లకు చోటిస్తే ఇక కష్టం అవుతుంది.