తేజు-సతీష్-ఏం జరిగింది అసలు?

సాయి ధరమ్ తేజ్ అందరికీ ఎంత పరిచయమో, ఆయన స్నేహితుడు..సన్నిహితుడు..మేనేజర్ సతీష్ కూడా ఇండస్ట్రీ జనాలకు, మెగా ఫ్యాన్స్ కు అంతకు అంతా పరిచయం. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పది పన్నెండేళ్లు…

సాయి ధరమ్ తేజ్ అందరికీ ఎంత పరిచయమో, ఆయన స్నేహితుడు..సన్నిహితుడు..మేనేజర్ సతీష్ కూడా ఇండస్ట్రీ జనాలకు, మెగా ఫ్యాన్స్ కు అంతకు అంతా పరిచయం. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పది పన్నెండేళ్లు పనిచేసి, తేజుతో వున్న స్నేహంతో మేనేజర్ గా మారారు. ఆ తరువాత నిర్మాణ నిర్వాహకుడుగా కూడా మారారు. 

ఇండస్ట్రీ లో అందరితో కలుపుగోరుతనంగా వుంటూ, సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో చూసుకుంటూ అన్నీ తానై వ్యవహరించారు ఇటీవీల విరూపాక్ష సినిమాకు. విరూపాక్ష ప్రమోషన్ వర్క్ లో సతీష్ ది కీలకపాత్ర అంటే అస్సల సందేహించక్కరలేదు. చాలా మంది సినిమా సెలబ్రిటీలు ఇదే విషయాన్ని ఓపెన్ స్టేజ్ మీద కూడా ప్రస్తావించారు.

ఒకప్పుడు సరైన సక్సెస్ లు లేని తేజు కు ఇప్పుడు ఓ మంచి మార్కెట్ ఏర్పడింది. చిత్రలహరి, సోలో బతుకే సో బెటరు, ప్రతిరోజూ పండగే, రిపబ్లిక్ సినిమాలతో ఎంతో కొంత రేంజ్ వచ్చింది. ఆపై విరూపాక్ష సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరాడు. అదిగో అక్కడ వచ్చింది తకరారు. 

ఈ విజయాల వెనుక సతీష్ పాత్ర ఇంతో అంతో వుంది. కథల ఎంపిక కావచ్చు, ప్రాజెక్టుల ఎంపిక కావచ్చు, నిర్మాణాల పర్యవేక్షణ కావచ్చు, ఆఖరికి పబ్లిసిటీ కావచ్చు. అన్నీ దగ్గర వుండి చూసుకుంటున్నారు. ఇలా సతీష్ కు కాంప్లిమెంట్ లు పెరగడం కొంతమందికి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. ఇకపై తేజు దగ్గర ‘మనవాడు’ వుండాలి కానీ ‘వేరేవాళ్లు’ కాదనే ప్రయత్నాలు మెగాక్యాంప్ లో మొదలైనట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడ కొన్ని కాస్ట్ ఈక్వెషన్లు పని చేసినట్లు తెలుస్తోంది. మెగా క్యాంప్ కు చెందిన ఓ వ్యక్తిని తీసుకువచ్చి బ్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను సాయి ధరమ్ తేజ్ అప్పగించారని తెలుస్తోంది. దీనికి సతీష్ అభ్యతరం చెప్పడం, తమ బంధువు, తన ఇష్టం అని సాయి ధరమ్ తేజ్ అన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మాట మాట పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా అయితే తాను మేనేజర్ గా వుండడని, వెళ్లిపోతానని అనడంతో, ఓకె అని తేజు వెంటనే చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఆ తరువాత సతీష్ వెళ్లిపోతుంటే, షూటింగ్ స్పాట్ లోనే తేజు గట్టిగా కాస్త పరుషమైన భాష వాడి, ఇకపై తనకు మొహం చూపించవద్దని అరిచినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం తేజు తన సినిమాల బాధ్యతలను గీతా కాంపౌండ్ లోని వ్యక్తికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి తేజు కు బంధువు అవుతారని అంటున్నారు. గమ్మత్తేమిటంటే అతని పేరు కూడా సతీష్ నే. గోదావరి జిల్లాకు చెందిన సతీష్ కూడా జెన్యూన్ గా పని చేసే మనిషే అని, మంచి వాడే అని ఇండస్ట్రీ టాక్. కొత్తగా వచ్చిన సతీష్ తన తల్లి చెప్పిన వ్యక్తి కావడం, అతన్ని ఈ పాత సతీష్ అడ్డుకోవడం అన్నది ఇక్కడ కన్ ఫ్రంటేషన్ కు దారి తీసినట్లు తెలుస్తోంది.

చాన్నాళ్ల క్రిందటే పవన్ తన వ్యవహారాలు చూసే శరత్ మరార్ ను మార్చారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత మెగా మేనేజర్ వ్యవహారం వార్తల్లోకి రావడం ఇదే.