తెలుగు దృశ్యం-3 ఆ ప‌ని చేసేస్తే పోలా..!

ఇండియాలో.. సీక్వెల్స్, రీమేక్స్.. ఈ విజ‌యాల ప‌రంప‌ర‌ను క‌లిగి ఉన్న ఏకైక ప్రాంచైజీ దృశ్యం మాత్ర‌మే. ఒక వెర్ష‌న్ రావ‌డం, ఆ వెంట‌నే అది రీమేక్ కావ‌డం, ఒక‌టికి మూడు నాలుగు భాష‌ల్లో రీమేక్!…

ఇండియాలో.. సీక్వెల్స్, రీమేక్స్.. ఈ విజ‌యాల ప‌రంప‌ర‌ను క‌లిగి ఉన్న ఏకైక ప్రాంచైజీ దృశ్యం మాత్ర‌మే. ఒక వెర్ష‌న్ రావ‌డం, ఆ వెంట‌నే అది రీమేక్ కావ‌డం, ఒక‌టికి మూడు నాలుగు భాష‌ల్లో రీమేక్! ఆ పై ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కు సీక్వెల్. ఆ సీక్వెల్ కూడా మ‌ళ్లీ మిగ‌తా భాష‌ల్లోనూ రీమేక్ కావ‌డం! ఇలాంటి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రాంచైజ్ దృశ్యం. 

మ‌రి ఈ ప‌రంప‌ర‌లో మూడో ఇన్ స్టాల్ మెంట్ రాబోతోంది. మ‌ల‌యాళంలో దృశ్యం త్రీ రూపొందించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చేశాయి. ఒరిజిన‌ల్ ను రూపొందించిన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, హీరో అంతా మూడో వెర్ష‌న్ కు రెడీ అవుతున్నారు. రెండో వెర్ష‌న్లోనే విచార‌ణ‌ను కొన‌సాగించి, కొంత సినిమాటిక్ ముగింపును ఇచ్చిన‌ట్టుగా ముగించారు. మ‌రి మూడో వెర్ష‌న్లో ఏం తీస్తారో కానీ, ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకు ఉన్న స‌క్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డుతో మూడో దృశ్యం ప‌ట్ల కూడా ఆస‌క్తి నెల‌కొని ఉంది.

ఇది ఎంత వ‌ర‌కూ వెళ్లిందంటే… ఈ సారి మ‌ల‌యాళీ వెర్ష‌న్ తో పాటే హిందీ వెర్ష‌న్ ను రూపొందించ‌నున్నార‌ట‌! దృశ్యం-2 హిందీలో భారీ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోవ‌డంతో, ఈ సారి లేట్ చేయ‌కుండా మ‌ల‌యాళంతో పాటే హిందీ వెర్ష‌న్ ను కూడా రూపొందించ‌నున్నార‌ని తెలుస్తోంది. మోహ‌న్ లాల్ హీరోగా ఈ సినిమా తెర‌కెక్కుతున్న ద‌శ‌లోనే అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా కూడా రూపొంద‌నుంది. ఇలా ఒకేసారి రెండు భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న సీక్వెల్ గా దృశ్యం- 3 నిల‌వ‌బోతోంది. అలాగే మ‌రిన్ని భారీ వ‌సూళ్ల‌ను అందుకోవ‌డానికి కూడా ఇదొక అవ‌కాశంగా నిల‌వ‌బోతోంది.

మ‌రి ప‌నిలో ప‌నిగా తెలుగు వెర్ష‌న్ రీమేక్ ను కూడా ఒకేసారి చేసేస్తే స‌రిపోతోందేమో! ఎలాగూ దృశ్యం-3కి పాజిటివ్ టాక్ వ‌స్తే అది తెలుగులో రీమేక్ కావ‌డం దాదాపు ఖాయం! ఈ నేప‌థ్యంలో మూడో ఇన్ స్టాల్ మెంట్ ను వెంక‌టేష్ అండ్ కో కూడా మ‌ల‌యాళంతో పాటే రూపొందిస్తే మేలేమో! ఎందుకంటే.. మ‌ల‌యాళంలో రూపొందాకా.. తెలుగు వెర్ష‌న్ ను తెస్తే, కొంద‌రు ప్రేక్ష‌కులు మ‌ల‌యాళీ వెర్ష‌న్ ను చూసేసి తెలుగు వెర్ష‌న్ ను ప‌ట్టించుకోరు. దృశ్యం-2 గ‌నుక తెలుగులో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఉంటే ఈ ప్ర‌భావం గ‌ట్టిగా ప‌డేది. 

ఓటీటీ విడుద‌ల కాబ‌ట్టి స‌రిపోయింది. కాబ‌ట్టి ఈ ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని మ‌ల‌యాళీ, హిందీ వెర్ష‌న్ల‌తో పాటు తెలుగు వెర్ష‌న్ ను చుట్టేస్తే స‌రిపోతుందేమో!