కమల్ హాసన్ దగ్గర నుంచి విశాల్ వరకూ తరచూ ఒక స్టేట్ మెంట్ ఇస్తూ ఉంటారు. మంచి కథ దొరికినప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తామని.. తమ అనువాద సినిమాను మార్కెట్ చేసుకున్నప్పడల్లా చెబుతూ ఉంటారు!
కమల్ హాసన్ ను కదిలించినా ఇదే మాట, రజనీని అడిగినా ఇదే డైలాగ్.. ఇక సూర్య, విక్రమ్, విశాల్, విజయ్.. వీళ్లందరూ ప్రతిసారీ ఇదే డైలాగ్ చెబుతూ ఉంటారు. మరి తెలుగులో వీరికి మంచి కథలు దొరికేదెప్పుడు.. వీరు తెలుగు సినిమా చేసేదెప్పుడూ అనేది తేలే అంశం కాదు. చేయకపోయినా నష్టం లేదు కానీ, ఆ డైలాగ్ రొటీన్ గా వాడి విసుగు తెప్పించారు ఈ తమిళ హీరోలు!
వారిలో కమల్ ఆ మధ్య చీకటి రాజ్యం సినిమాను తెలుగు వెర్షన్ ను కూడా తమిళంతో పాటే షూట్ చేయించాడు. ఇక విశాల్ సినిమాల్లో కొన్ని పాత్రాలతో సీన్లను తెలుగు, తమిళ భాషలకు వేర్వేరుగా షూట్ చేయిస్తూ ఉంటారు.
మరి తమిళ హీరోలందరి వరసా అలా ఉంటే.. ధనుష్ మాత్రం డైరెక్టు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కాదు వరసగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అవి కూడా ఏవో ప్రత్యేక పాత్రలు, స్పెషల్ అప్పీరియన్స్ లు కాదు.. ఫుల్ లెంగ్త్ సినిమాలు. తనే హీరోగా నటిస్తున్న సినిమాలు. ఇప్పటికే ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వీలైనప్పుడల్లా సినిమాలు చేస్తున్నాడు. హిట్స్ కూడా కొట్టాడు. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటికే వైవిధ్యభరితమైన కథ, కథనాలతో కూడిన తమిళ సినిమాలను చేయడంలో ధనుష్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. ఇక నిర్మాతగా మారి మరి కొన్ని వైవిధ్యభరిత సినిమాలను తీశాడు. ఒక వేరే భాషల సినిమాలకు కూడా ఓకే చెబుతూ.. మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.
ఇలాంటి ప్రయత్నం చేయాలంటే.. ఇప్పుడు కూడా కమల్ కో, రజనీకో కూడా కథలు దొరుకుతాయి. అయితే.. వారి ప్రయత్నంలో అంత చిత్తశుద్ధి లేదు. వారికంత అవసరమూ లేకపోవచ్చు. అయితే తనను తను నిరూపించుకోవడానికి, ప్రత్యేకంగా ప్రేక్షకులకు చేరువ కావడానికి ధనుష్ ఈ తరహా మార్గాలను ఎంచుకుంటున్నట్టుగా ఉన్నాడు.