ఒక పక్క టాలీవుడ్ గిల్డ్ చర్చలు సాగుతున్నాయి. నిర్మాణాలు బంద్ అయ్యాయి. థియేటర్లను బతికించడానికి ఓటిటికి సినిమాలు ఇచ్చే సమయాన్ని పది వారాలకు తగ్గించుకుంటున్నాం అంటున్నారు సినిమా పెద్దలు. కానీ అది ఎనిమిది వారాలకు అంటే 56 రోజలకు పరిమితం చేయబోతున్నారు. అది వేరే సంగతి.
కానీ ఇలా ఓటిటికి ఆలస్యంగా ఇవ్వడం వల్ల నిర్మాత కొంత ఆదాయం నష్టపోతున్నారు కనుక, థియేటర్ల యజమానులు పెద్ద మనసు చేసుకుని విపిఎఫ్ చార్జీలు భరించాలని ప్రతిపాదన నడుస్తోంది. కానీ ఓటిటికి ఇచ్చే సమయం పెరిగితే థియేటర్లో ఎక్కువ రోజులు సినిమా వుంటుంది. దాని వల్ల నిర్మాతకు కూడా ఆదాయం పెరుగుతుంది, అక్కడ తగ్గిన ఆదాయం ఇక్కడ వస్తుంది కదా అంటున్నారు థియేటర్ల యజమానులు. అది కూడా వేరే సంగతి.
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఓటిటి నిర్ణయం ఓ పక్క చర్చల్లో వుండగానే, నిర్మాణంలో లేని, నిర్మాణం ఇంకా ప్రారంభం కానివి, ఎప్పుడో ప్రారంభం అయ్యేవి కూడా ఓటిటికి వెళ్లిపోతున్నాయి, వెళ్లి పోయాయి. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం 2023 అంటే వచ్చే ఏడాది డిసెంబర్ వరకు విడుదల అవుతాయి అనుకున్న సినిమాలు అన్నీ దాదాపుగా ఓటిటి కి వెళ్లిపోయాయి. అవన్నీ కూడా ఎనిమిది వారాల లోపే ఓటిటిలో ప్రత్యక్షం అవుతాయి.
ఇలా ముందుగానే ఇల్లు చక్కబెట్టేసుకున్న సినిమాల జాబితాలో ఇప్పటికి ఇంకా కొబ్బరికాయ, క్లాప్ కొట్టని సినిమాలు కూడా వున్నాయట. అంటే ఏమిటి అర్థం. 8 వారాల ఓటిటి నిబంధన అమలు అయ్యేది చిన్న నిర్మాతలు తీసే సినిమాలకు, లేదా చిన్న సినిమాలకు మాత్రమే.పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ముందుగానే ఓటిటికి వచ్చేస్తాయన్నమాట. ఇందుకోసం అవసరం అయితే ఓ లూప్ హోల్ ను కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే డైరెక్ట్ గా ఓటిటి సంస్థలతో డీల్ సెట్ కాకపోతే మిడిల్ ఏజెన్సీలతో ముందుగా ఓ లెటర్ తీసుకుని వుంచుకోవడం అన్నమాట.
2023 అంటే ఏడాదిన్నర సమయం వుంది. అప్పటి పరిస్థితులు ఎలా వుంటాయో, వాటిని బట్టి అప్పుడు మళ్లీ ఓటిటి నిర్ణయం మారుతుందో, మారదో అన్నది పరమాత్ముడికి ఎరుక. ఓటిటి పేరు చెప్ప తమ మెడలు వంచాలని చూస్తున్నారని, తెరవెనుక మాత్రం ఇలా జరిగిపోతోందని ఓ ఎగ్జిబిటర్ ఆవేదన వ్యక్తం చేసారు. అదీ విషయం.