థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? ఇదీ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రశ్న. అయితే అసలు ఇప్పట్లో థియేటర్లు తీస్తే జనం వస్తారా? రారా? అన్న మరో అనుమానం అలా వుండేనే వుంది. ఇలాంటి టైమ్ లో మరో వాదన కూడా వినిపిస్తోంది. అసలు ఇప్పుడు థియేటర్లు తీయడం వల్ల పెద్దగా ప్రయోజనం వుండదని.
లాక్ డౌన్ అనేది మే నెలాఖరు వరకు వుంటుందని దాదాపుగా అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అంటే జూన్ 15 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం వుంది. కానీ అప్పుడు తెరవడం వృధా అని ఇండస్ట్రీ జనాల మాట. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తి వేయగానే ముందుగా జనం హడావుడి పడేది పిల్లల చదువుల గురించి, స్కూళ్లు, పుస్తకాలు, ఫీజులు, వాటి విషయంలో జాగ్రత్తలు ఇలా సవాలక్ష వుంటాయి. ఈ టైమ్ లో థియేటర్లకు ఫ్యామిలీలు రమ్మన్నారావు. ఇక కరోనా భయం వుండనే వుంటుంది.
అందువల్ల ఈ వ్యవహారాలు అన్నీ సెటిల్ అయ్యాకే థియేటర్లకు. అందువల్ల దానా దీనా, ఆగస్టు 15 నుంచి అయితే థియేటర్ల వైపు జనం చూడడం స్టార్ట్ కావచ్చని సినిమా ఇండస్ట్రీ జనాలు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఇంకో పాయింట్ కూడా వుంది. విడుదలకు రెడీ అయిన సినిమాలు అన్నింటికీ కొద్దో, గొప్పో పోస్ట్ ప్రొడక్షన్ పని వుండనే వుంది. కనీసం వారం పది రోజులు. అలాగే పబ్లిసిటీకి మరో వారం పది రోజులు.
ఇవన్నీ కలిపి జూన్ నెలను కానిచ్చేస్తాయి. అందువల్ల జూలైలోనే ఏ సినిమా అయినా థియేటర్లోకి వచ్చేంది. ఆ నెల సాధారణంగా డల్ మంత్. అందువల్ల ఆగస్టు వరకు థియేటర్లు తెరుచుకున్నా, లేకపోయినా ఒకటే.