ముందుగా అనుమానించినట్టుగానే లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి గ్రీన్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు కానీ సినిమా థియేటర్లకి మాత్రం ఎక్కడా పర్మిషన్ లేదు. గ్రీన్ జోన్స్ అనుకున్న ప్రదేశాల్లోను సినిమా థియేటర్లు నిషిద్ధం. మే 3 తర్వాత లాక్ డౌన్ సడలింపులు పెరిగినా కానీ సినిమా థియేటర్లకి పర్మిషన్ రావడం అనుమానమే.
జూన్ నెలాఖరు వరకు కూడా సినిమా థియేటర్లపై నిషేదాజ్ఞలు అమలులో వుంటాయని భావిస్తున్నారు. షూటింగ్స్ కూడా ఆగస్ట్ నుంచి కానీ సజావుగా సాగవని చిత్ర పరిశ్రమలో చెబుతున్నారు. ఎగ్జిబిటర్లు ఈ లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. సినిమా హాళ్లలో పని చేసే సిబ్బంది జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. క్యాంటీన్ లీజ్‌కి తీసుకున్న వారికి కూడా భారీగా నష్టాలొస్తున్నాయి.
ఇటు పూర్తయిన సినిమాలు విడుదల చేసుకోలేని పరిస్థితి కావడంతో నిర్మాతలపై వడ్డీ భారం పెరిగిపోతోంది. ఓటీటీ సంస్థలు మామూలుగా కంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నా కానీ ముప్పయ్, నలభై కోట్ల విలువ చేసే సినిమాలని అలా విడుదల చేసే పరిస్థితి లేదు. రెడ్ గురించి రామ్, వి గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ ఎప్పటికయినా థియేటర్లలోనే విడుదలవుతాయని స్పష్టం చేసారు.