cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈవారం ట్రేడ్‌ టాక్‌: బ్లాక్‌బస్టర్‌ సంక్రాంతి

ఈవారం ట్రేడ్‌ టాక్‌: బ్లాక్‌బస్టర్‌ సంక్రాంతి

తెలుగు సినిమా బిజినెస్‌ పరంగా సంక్రాంతికి ఎంత డిమాండ్‌ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒకే వారంలో మూడు, నాలుగు పెద్ద సినిమాలు విడుదలైనా కానీ అన్నిటికీ ఆదరణ లభించిన సందర్భాలు చాలానే వున్నాయి. మిగిలిన ఏ పండగలకి కూడా క్లాష్‌ అనగానే భయపడిపోయే నిర్మాతలు సంక్రాంతికి క్లాష్‌ వుంటుందంటే మాత్రం వెనక్కి తగ్గరు. గత సంక్రాంతికి ఎన్టీఆర్‌ బయోపిక్‌, వినయ విధేయ రామ మిస్‌ఫైర్‌ అవడంతో 'ఎఫ్‌ 2' ఒక్కటే 'పండగ' చేసుకుంది.

అంతకుముందు ఏడాది 'అజ్ఞాతవాసి'కి భయపడి వేరే సినిమాలన్నీ వెనక్కి వెళ్లడంతో అది ఫ్లాపయ్యాక జనాలకి చూసేందుకు ఒక్క సరయిన సినిమా లేకపోయింది. ఆ లోటుని భర్తీ చేస్తూ ఈ సంక్రాంతి బాక్సాఫీస్‌ పరంగా బ్లాక్‌బస్టర్‌ అయింది. సంక్రాంతికి వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర పండుగని క్యాష్‌ చేసుకోవడంతో ధనలక్ష్మి విజయ తాండవం చేసింది.

సంక్రాంతి విజేత!

సంక్రాంతి విజేత మాదంటే మాదంటూ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలకి పోటీలు పడి పోస్టర్లు విడుదల చేస్తున్నారు. అయితే 'సిసలైన విజేత' మాత్రం అనుమానం లేకుండా 'అల వైకుంఠపురములో'నే. ఈ చిత్రం విడుదలయింది లగాయతు ఒక్క రోజు కూడా వెనక్కి తగ్గింది లేదు. మొదలు పెట్టడమే వీరవిహారంతో మొదలు పెట్టిన ఈ చిత్రం రెండవ రోజు నుంచి ప్రతి రోజు 'నాన్‌-బాహుబలి' రికార్డు షేర్లని సాధిస్తూ ఫుల్‌గా డామినేట్‌ చేసేసింది.

క్లాస్‌ సినిమా కనుక మాస్‌ సెంటర్స్‌లో 'సరిలేరు నీకెవ్వరు'కి లీడ్‌ వుంటుందని భావించారు కానీ సి సెంటర్లలో, సీడెడ్‌లో కూడా పండగ ప్రేక్షకులకి 'అల వైకుంఠపురములో' ఫస్ట్‌ ఛాయిస్‌గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు కంటే తక్కువ ధరలకి అమ్ముడయిన చిత్రమయినా కానీ, దానికంటే ఒక్క రోజు ఆలస్యంగా విడుదలయినా కానీ అంతిమంగా ఆ చిత్రానికి మించిన వసూళ్లు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అజ్ఞాతవాసితో త్రివిక్రమ్‌ బ్రాండ్‌కి జరిగిన డ్యామేజ్‌ ఈ చిత్రంతో రిపేర్‌ అయిపోయింది. అలాగే అల్లు అర్జున్‌ని తిరిగి అగ్ర హీరోల రేసులో నిలబెట్టింది. ఈ చిత్ర విజయానికి మంచి ఫ్యామిలీ డ్రామా అనే కారణం ఒక్కటే కాకుండా తమన్‌ అందించిన పాటలు అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయ్యాయి. ఈ చిత్రానికి ఆ పాటలే యుఎస్‌పిగా నిలిచి సంక్రాంతి రేసులో మిగతా సినిమాల కంటే చాలా ముందు నిలబెట్టాయి.

మాస్‌ మసాలా పవర్‌!

కాస్తయినా కొత్తదనం లేకుండా ఫార్ములానే నమ్ముకుని తీసిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కంటెంట్‌ పరంగా చాలా వీక్‌ అనిపించినా కానీ పండగ టైమ్‌లో ప్రేక్షకులకి కావాల్సిన కాలక్షేపాన్ని ఇవ్వడంతో పాటు భారీ రిలీజ్‌ కూడా ప్లస్‌ అయింది. మహేష్‌లాంటి పెద్ద స్టార్‌ వుండడంతో ఈ చిత్రానికి అతని స్టార్‌డమ్‌ కవచంగా నిలిచింది.

అల వైకుంఠపురములో విజయ దుందుభి మోగిస్తున్నా కానీ థియేటర్లని హోల్డ్‌ చేసి పెట్టడంతో పండగ సీజన్‌ని ఈ చిత్రం పూర్తిగా క్యాష్‌ చేసుకుంది. నమ్మశక్యం కాని నంబర్లు ప్రచారంలోకి తెచ్చి ఈ చిత్రం నిజంగా సాధించిన వసూళ్లని చిన్నబుచ్చే ప్రయత్నం మేకర్స్‌ నుంచి జరుగుతోంది కానీ వాస్తవంగా వసూలు చేసిన దానిని బట్టి ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కావడం సాధ్యమే అనిపిస్తోంది. అయితే పండగ అయిపోయిన తర్వాత సెకండ్‌ వీకెండ్‌లో ఎలా పర్‌ఫార్మ్‌ చేస్తుందనే దానిని బట్టి బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందా లేక దగ్గరగా వెళుతుందా అనేది తేలుతుంది.

అల వైకుంఠపురములో స్థాయిలో వసూళ్లు తెచ్చుకోకపోయినా కానీ ఈ చిత్రం కూడా స్థాయికి తగ్గట్టు పర్‌ఫార్మ్‌ చేయడంతో ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద కాసుల గలగల బాగా వినిపించింది.

గుడ్‌ ఓపెనింగ్‌!

సంక్రాంతికి పెద్ద సినిమాలదే ఆధిపత్యం కాగా, వాటితో పాటు విడుదలైన 'దర్బార్‌'కి మంచి ఓపెనింగ్‌ వచ్చింది. కానీ ఆ తర్వాత సరిలేరు, అల ధాటిని తట్టుకోలేక వెనకబడింది. అలాగే ఆ సినిమాల తర్వాత వచ్చిన 'ఎంత మంచివాడవురా'కి మొదటి రోజు డీసెంట్‌ ఓపెనింగ్‌ వచ్చింది కానీ టాక్‌ మాత్రం చాలా బ్యాడ్‌గా వుంది. అసలే థియేటర్లు తక్కువ లభించడంతో ఈ టాక్‌తో ఆ చిత్రం నిలబడడం కష్టమేననిపిస్తోంది. మొత్తం మీద ఈ సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్‌ వద్ద కనక వర్షం కురిసింది. ఈ ఊపుతో వచ్చే ఏడాది సంక్రాంతికి మరింత పోటీ నెలకొనడం గ్యారెంటీ.