దాదాపు రెండేళ్ల కిందటి సంగతి.. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్, దానికి అనుబంధంగా ఉన్న పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ టైమ్ లో మోడల్ లిషి, ఆమె సోదరి ఖుషిత కూడా పోలీసులకు దొరికారు.
ఆ టైమ్ లో మీడియా ముందుకొచ్చిన ఖుషిత ఇచ్చిన స్టేట్ మెంట్ బాగా వైరల్ అయింది. పబ్ లో డ్రగ్స్ ఉన్నాయనే విషయం తమకు తెలియదని కేవలం, చీజ్ బజ్జీ తినేందుకు మాత్రమే పబ్ కు వచ్చామంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.
అప్పట్లో ఆ స్టేట్ మెంట్ వైరల్ అయింది. బజ్జీ తినడానికి పబ్ కు వెళ్తారా అంటూ చాలామంది నవ్వుకున్నారు. కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత అదే ఖుషిత సోదరి లిషి గణేశ్, డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయింది.
ఈసారి కూడా అదే పబ్. పార్టీ గట్టిగా జరుగుతోంది. ఎక్కడ చూసినా కొకైన్. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఒక్కర్ని కూడా విడిచిపెట్టకుండా అరెస్ట్ చేశారు. 10 మందిపై కేసులు పెట్టారు. వాళ్లలో ఒకరు మన బజ్జీ పాప లిషి కూడా.
మరోసారి బయటపడిన టాలీవుడ్ కనెక్షన్.. డ్రగ్స్ వ్యవహారం ఎక్కడ బయటపడినా అక్కడ టాలీవుడ్ పేరు వినిపిస్తుంది. రాడియన్ బ్లూ పబ్ వ్యవహారంలో కూడా టాలీవుడ్ పేరు వినిపించింది.
రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు తయారుచేసిన ఎఫ్ఐఆర్ లో నిర్మాత కేదార్ పేరు ప్రత్యక్షమైంది. ఇతడు ఆనంద్ దేవరకొండతో గమ్ గమ్ గణేశ అనే సినిమా నిర్మించాడు. విజయ్ దేవరకొండ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్రకటించింది ఈయనే.
రాడిసన్ లో పార్టీ చేసుకున్న వ్యక్తులందరికీ కొకైన్ అందించింది ఒకడే. అతడి పేరు అబ్బాస్ అలీ. అతడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఎక్కడ్నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.