అనుభవం అయితే తత్వం బోధపడుతుంది. నిర్మాతలు ఇస్తున్నారు కదా అని అడ్వాన్స్ లు చటుక్కున తీసుకుంటే, సమస్యలు చుట్టుముడుతున్నాయి. దానయ్యకు మారుతి, మైత్రీ మూవీస్ కు త్రివిక్రమ్, పరుచూరి ప్రసాద్ కు హరీష్ శంకర్ వడ్డీలు కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కొరటాల శివ తీసుకున్న అడ్వాన్స్ లకు వడ్డీలు పెరుగతున్నాయని బోగట్టా.
ఈ నేపథ్యంలో తెలుగు దర్శకులు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నిర్మాతల ఆటలు సాగకుండా, అడ్వాన్స్ అంటూ తీసుకుంటే, పక్కాగా అగ్రిమెంట్ రాసుకునే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ మధ్యన వరుసగా మీటింగ్ లు జరుపుతున్నారు తెలుగు దర్ళకులు. అందులో భాగంగా నిన్న కూడా మీటింగ్ పెట్టుకున్నారు.
ఇకపై ఎవరైనా అడ్వాన్స్ లు తీసుకుంటే, కొంత కాలం గ్యాప్ ఫిక్స్ ఛేసుకుని, ఆ తరువాత నుంచే వడ్డీలు లెక్క కట్టేలా రాసుకోవాలని, అది కూడా ఇంతకు మించి వుండరాదని క్లియర్ గా రాసుకొవాలని, ఇలా అనేక నియమాలు క్లియర్ గా , క్లారిటీగా రాసుకున్న తరువాతే అడ్వాన్స్ తీసుకోవాలని అందరూ కలిసి అనుకున్నారు.
అలాగే ఇకపై యూనియన్లకు తలొగ్గకుండా, ఎంత మంది కావాలో అంతమంది వర్కర్లను మాత్రమే తీసుకోవాలని, అయిదు మంది కావాలంటే, పది మందిని తీసుకోవాలనే వత్తిడికి లొంగ కూడదని డిసైడ్ అయ్యారు.
అలాగే ఉదయం పది నుంచి రాత్రి పది వరకు 12 గంటల షిఫ్ట్ పెట్టుకోవాలని, అలా కాకుండా ఉదయం నుంచే షూట్ అంటే యాక్టర్లు తాపీగా 10 గంటలకు రావడం, సెట్ లోనే మేకప్ వేసుకోవడం తో సమయం వృధా అవుతోందని, కాల్ షీట్లు పెరుగుతున్నాయని, ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయ్యారు.
అసలు దర్శకుల వల్లే ప్రాజెక్టుల సెట్ అవుతున్నాయని, హీరోలు-దర్శకులు కలిసి ప్రాజెక్టు సెట్ చేస్తే నిర్మాతకు సినిమా వస్తోందని, సింపుల్ గా ఫైనాన్స్ తో సినిమా చేస్తున్నారని ఓ దర్శకుడు సమావేశంలో అన్నట్లు బోగట్టా. అయితే ఇక్కడ నిర్మాతలకు రిస్క్ కూడా వుంటుంది కదా? అని మరికొందరు అన్నారని తెలుస్తోంది.
మొత్తం మీద టాలీవుడ్ లో దర్శకుల హవా మళ్లీ స్టార్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.