అల్లు అరవింద్ కు అసలు విషయం అర్థమైంది

ఆ మాటకొస్తే అల్లు అరవింద్ కే కాదు, మొత్తం ఇండస్ట్రీకే ఈ విషయం అర్థమైంది. దీన్ని అల్లు అరవింద్ 2 ముక్కల్లో సింపుల్ గా చెప్పేశారు. “టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీని కాస్త దూరం…

ఆ మాటకొస్తే అల్లు అరవింద్ కే కాదు, మొత్తం ఇండస్ట్రీకే ఈ విషయం అర్థమైంది. దీన్ని అల్లు అరవింద్ 2 ముక్కల్లో సింపుల్ గా చెప్పేశారు. “టికెట్ రేట్లు తగ్గించాలి, ఓటీటీని కాస్త దూరం పెట్టాలి” అంటూ సింపుల్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు అరవింద్. చూడ్డానికి ఈ స్టేట్ మెంట్ సింపుల్ గా ఉన్నప్పటికీ, దీని వెనక జరిగిన పరిణామాలు, ఇండస్ట్రీ ఎదుర్కొన్న సవాళ్లు చాలానే ఉన్నాయి.

ఇండస్ట్రీ స్లంప్ లో ఉందంటూ ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచేశారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు అది బాగానే గిట్టుబాటు అయింది. దీంతో డబ్బులు పిండుకుందామనే యావలో అర్జున-ఫల్గుణ లాంటి సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేశారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఆచార్య సినిమాతో పూర్తిగా క్లారిటీ వచ్చింది. దీంతో మొదటికే మోసం వచ్చిందని గ్రహించి టికెట్ రేట్లు మళ్లీ తగ్గించడం మొదలు పెట్టారు.

ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచారు. ప్రత్యేకంగా పెంచలేదు. ఇక మేజర్ సినిమాకైతే ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే తక్కువ ధరలకే టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. ఇప్పుడీ బాటలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.

ఇక ఓటీటీ విషయానికొస్తే.. ఇక్కడ కూడా టాలీవుడ్ పాఠాలు నేర్చుకుంది. థియేట్రికల్ వ్యవస్థను కాదని, విడుదలైన వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఇచ్చేయడం లాంటివి జరిగాయి. మొన్నటివరకు చిన్న సినిమాలే ఇలా చేస్తున్నాయనుకుంటే, రీసెంట్ గా రాధేశ్యామ్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలు కూడా చాలా తొందరగా ఓటీటీలోకి రావడం మొదలైంది. 

ఇది కూడా ప్రేక్షకుల్ని థియేటర్లకు దూరం చేసింది. ఎఫ్3 సినిమా యూనిట్ అయితే, తమ సినిమా ఓటీటీలోకి ఇప్పట్లో రాదని, కాబట్టి అంతా థియేటర్లకు రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

అలా టికెట్ రేట్లు, ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఇండస్ట్రీ ఓ అవగాహనకు వచ్చింది. తాజాగా జరిగిన పరిణామాలతో గుణపాఠాలు నేర్చుకుంది. అల్లు అరవింద్ మాటల్లో అదే స్పష్టమైంది.

నాగార్జున అప్పుడే చెప్పాడు..

నిజానికి ఈ విషయాలన్నింటినీ నాగార్జున ఎప్పుడో చెప్పారు. టికెట్ రేట్లు పెంచడం సరికాదని బంగార్రాజు ప్రమోషన్ టైమ్ లోనే నాగార్జున అభిప్రాయపడ్డారు. రేట్లు పెంచడం వల్ల థియేట్రికల్ మార్కెట్ దెబ్బతింటుందని, ఆ ప్రభావం నిర్మాత, హీరో, బడ్జెట్.. ఇలా చాలా అంశాలపై పడుతుందని కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే నిజమైంది. అంతా నాగార్జున దారిలోకి వచ్చారు.

అదే టైమ్ లో ఓటీటీపై కూడా నాగార్జున తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు. ఓటీటీ అనేది థియేటర్ కు సమాంతరంగా నడవాలి తప్ప, ప్రత్యామ్నాయం కాకూడదని అన్నారు. ప్రేక్షకులకు థియేటర్ తర్వాత ఓటీటీ అనే ఫీలింగ్ ఉండాలి తప్ప, థియేటర్ వదిలేసి ఓటీటీకి వెళ్దాం అనే ఆలోచన రాకూడదన్నారు. ఇప్పుడు ఆడియన్స్ కు అదే మైండ్ సెట్ రావడంతో ఇండస్ట్రీ పెద్దలంతా జాగ్రత్త పడుతున్నారు.

మొత్తమ్మీద ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మళ్లీ దిద్దుబాటు చర్యల్లోకి దిగుతోంది. అల్లు అరవింద్ చెప్పినట్టు ఇకపై దాదాపు ప్రతి సినిమాకు టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే టైమ్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా కాస్త దూరంగా జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.