ఏ సినిమాకు ఎంత ఖర్చయిందో.. ఏ సినిమా వసూళ్లు ఎంతో అన్నది సినిమా నిర్మాత అక్కౌంట్ డిపార్ట్ మెంట్ కు తప్ప, వేరే వాళ్లకు తెలియదు. తెలిసినా దానికి కాస్త అటు ఇటుగానే తప్ప సరైన అంకె అయితే కాదు. అసలు అన్నింటి కన్నా ముందుగా తెలియాల్సింది.
థియేటర్ల డిసిఆర్, అక్కడి నుంచి సెకెండ్ షో తరువాత డిస్ట్రిబ్యూటర్ అన్నింటిని కలిపి, టేబుల్ తయారు చేసి, గ్రాస్, నెట్, షేర్ లెక్కలు కట్టడం జరగాలి. ఎక్కడా ఒక్క ఈక్వెషన్ వుండదు. సింగిల్ స్క్రీన్ ఒక మాదిరిగా, మల్టీ ఫ్లెక్స్ లుగా మారిన సింగిల్ స్క్రీన్ లు మరో మాదిరిగా, మల్టీ ఫ్లెక్స్ లు ఇంకో మాదిరిగా ఇలా రకరకాలుగా వుంటాయి. ఏ రోజుకు ఆ రోజు బయటకు వచ్చే అంకెలు కాస్త అటు ఇటుగా తప్ప నికార్సు అంకెలు కావు.
అయితే థియేటర్ల ద్వారా, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా, ఇలా రకరకాల సోర్స్ ల ద్వారా సోషల్ మీడియా ఔత్సాహికులు కావచ్చు, బాక్సాఫీస్ పోర్టల్స్ కావచ్చు, రమారమీ అంకెలు తెలుసుకుని వేయడం మామూలే. అయితే చాలా కాలంగా ఫేక్ కలెక్షన్లు అన్నవి మామూలైపోయాయి. కొన్ని పోర్టల్స్ లేదా కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ను మేనేజ్ చేయడం అన్నది మొదలైపోయింది. దాంతో అసలు అంకెలకు బదులు కలుపుడు అంకెలు రావడం మొదలైంది.
ఇలాంటి టైమ్ లో ఈ మేనేజ్ మెంట్ కు దూరంగా వున్న సైట్లు కానీ హ్యాండిల్స్ కానీ అసలు అంకెలకు కాస్త దగ్గరగా వున్న ఫిగర్స్ సంపాదించి అందించడం మొదలైంది. దీంతో నిర్మాతలు కొత్త మార్గాలు మొదలుపెట్టారు. బ్లాక్ అండ్ వైట్ అక్కౌంట్ లు ఎలాగూ వుంటాయి. అందువల్ల రెండు డిసిఆర్ లు అనేవి కూడా అక్కడక్కడ తప్పవు. అందువల్ల అవసరం అయితే డిసిఆర్ లు ఫుల్స్ రాయించడం అనే టెక్నిక్ మొదలుపెట్టారు.
ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ల కు ముందుగానే ఆదేశాలు ఇవ్వడం మొదలయింది. మీడియా కావచ్చు, సోషల్ మీడియా జనాలు కావచ్చు. ఎవరు అడిగినా ఏ అంకె చెప్పాలి అన్నది నిర్మాతల దగ్గర నుంచి ఆదేశాల రూపంలో ముందే వెళ్లడం మొదలైంది. ఆపై పెద్ద పెద్ద ముద్ద అంకెలతో పోస్టర్లు వేయడం అన్నది కామన్ అయిపోయింది.
ఇదంతా చేసేది కేవలం హీరోల మెహర్బానీ కోసం తప్ప వేరు కాదు. హీరోలు ఈ అంకెలు చూపించి రెమ్యూనిరేషన్ పెంచుకోవడానికి పనికి వస్తాయి. అదే జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కారం కలెక్షన్ల గడబిడ మొదలైంది. ఆంధ్ర తప్ప నైజాం, సీడెడ్, కర్ణాటక, ఓవర్ సీస్ ల్లో ఆ సినిమా గట్టిగా ఆడడం లేదు అన్నది వాస్తవం. ఆంధ్రలోని బయ్యర్లలో గుంటూరు, ఈస్ట్ బయ్యర్లు నిర్మాతకు ఆప్తులు. కృష్ణ రిటర్న్ గ్యారంటీ మీద ఇచ్చారు. మిగిలిన వెస్ట్, వైజాగ్ అంతా అదే నిర్మాత రెగ్యులర్ బయ్యర్లు. అక్కడ అంకెలు సహజంగానే బయటకు రావు. వచ్చినా నిర్మాత ఎలా అనుకుంటే అలాగే వస్తాయి.
ఇప్పుడు ఇలా అంకెలు వేసే వెబ్ సైట్ ల మీద, ట్విట్టర్ హ్యాండిల్స్ మీద నోటీసుల యుద్దం చేస్తామనే ఫీలర్లు బయటకు వదలడం ప్రారంభించారు. ఇదంతా అయ్యే పనేనా? సోర్స్ చెప్పమని మీడియాను గతంలో చాలా మంది కోర్టుకు లాగే ఏమీ సాధించలేకపోయారు. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనక్కరలేదు.
అసలు నిర్మాతలు ఓ మాట చెప్పగలరా? ఇన్ కమ్ టాక్స్ కు చూపించే సినిమా వసూళ్లు లెక్కలు బయటకు ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వాలి? అని అడిగితే అది వేరే సంగతి. ఇంత వసూలు చేసింది అని పోస్టర్లు వేస్తున్న నిర్మాతలే, ఇన్ కమ్ టాక్స్ అధికారులకు, అదంతా ఫ్యాన్స్ కోసం అని చెప్పడం అలవాటే కదా? మరి అలాంటపుడు, వాళ్ల పోస్టర్ అంకెలే ఫేక్ అయినపుడు, వేరే వెబ్ సైట్ లు, ట్విట్టర్ హ్యాండిల్స్ వేసే అంకెలు ఫేక్ అనే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది.
ప్రతి పెద్ద సినిమా టైమ్ లో ఈ గడబిడ మామూలే. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కలసి ఓవర్ సీస్ లో మాదిరిగా ఓ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఏ గొడవా లేదు కదా. పైగా ఇది వారికే మంచిది. హీరోలకు క్లారిటీ వస్తుంది. తమ సినిమాలు ఎంత చేస్తున్నాయో. అప్పుడు రెమ్యూనిరేషన్ల డిమాండ్ తగ్గుతుంది.