టాలీవుడ్ లో ఒంటరి అవుతున్న దిల్ రాజు!

ఇన్నాళ్లూ తన హవా నడిపించుకుంటూ వస్తున్నారు. దిల్ రాజు ఆయన వెనుక వుండి శిరీష్ రెడ్డి నిర్మాణం..పంపిణీ..ఎగ్జిబిషన్ రంగాలను గుప్పిట్లో వుంచుకుని టాలీవుడ్ ను శాసిస్తూ వస్తున్నారు. అల్లు అరవింద్..యువి వంశీ..ఇంకా జిల్లాల్లో కీలకమైన…

ఇన్నాళ్లూ తన హవా నడిపించుకుంటూ వస్తున్నారు. దిల్ రాజు ఆయన వెనుక వుండి శిరీష్ రెడ్డి నిర్మాణం..పంపిణీ..ఎగ్జిబిషన్ రంగాలను గుప్పిట్లో వుంచుకుని టాలీవుడ్ ను శాసిస్తూ వస్తున్నారు. అల్లు అరవింద్..యువి వంశీ..ఇంకా జిల్లాల్లో కీలకమైన పంపిణీ దారులు అందరినీ కలుపుకుని, టోటల్ ఎగ్జిబిషన్ అండ్ పంపిణీ రంగాన్ని తమ గుప్పిట్లో వుంచుకున్నారు. ఏ సినిమాకు ఏ రేటు అన్నది డిసైడ్ కావాలంటే ఈ సిండికేట్ నే కీలకం. వీరంతా తెరవెనుక డిసైడ్ అయితే ఇక అంతకు మించి పలకదు. వీళ్లు అంతా కలిసి డేట్ ఇస్తేనే విడుదల. వీళ్లందరి తరపున టోటల్ చక్రం తిప్పేది దిల్ రాజే. సురేష్ బాబు-ఆసియన్ సునీల్ ఈ సిండికేట్ లో భాగస్వామ్యం కాకపోయినా, ఎక్కువ సినిమాల పంపిణీ దిల్ రాజు దగ్గరే వుండడంతో, నైజాంలో వాళ్ల థియేటర్ కు బిజినెస్ కావాల్సి వుండడంతో, ఎంతో కొంత చేతులు కలపక తప్పలేదు.

టాలీవుడ్ లో యంగ్ జనరేషన్ కు ఇదంతా నచ్చడం లేదు. కానీ తప్పడం లేదు. గిల్డ్ సమ్మె టైమ్ లో కాస్త నిరసన కనిపించింది. కానీ పెద్దగా వెలికి రాలేదు. గిల్డ్ సమ్మె సమయంలో తన సినిమా షూట్ చేసుకుని, మిగిలిన వాటిని బంద్ చేయించారు. పైగా తనది డబ్బింగ్ సినిమా అని వాదించారు. అప్పటి నుంచి దిల్ రాజు మీద టాలీవుడ్ ఇన్ సైడ్ లో అసంతృప్తి రగులుతూ వచ్చింది.

కానీ అంతకు ముందే కొంచెం కొంచెంగా హీరోలు దిల్ రాజు ను దూరం పెట్టడం ప్రారంభించారు. సర్కారు వారి పాట సమయంలో దిల్ రాజు పద్దతికి మహేష్ బాబుకు కోపం వచ్చింది. తన తరువాత సినిమా హక్కులు దిల్ రాజుకు ఇవ్వడానికి వీలు లేదని నిర్మాతకు ముందే చెప్పేసారు. ఎన్టీఆర్ ఎందుకనో ఏనాటి నుంచో దిల్ రాజును కాస్త దూరమే పెట్టారు. అల్లు అర్జున్ రేపు ఎల్లుండి అంటున్నారు కానీ సినిమా చేయడం లేదు. దిల్ రాజు చేతిలో వున్న ఏకైనా తెలుగు పెద్ద సినిమా రామ్ చరణ్ ది మాత్రమే. మిడ్ రేంజ్ హీరోల సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి తప్ప స్టార్ట్ కావడం ముందు వెనుక అవుతోంది.

ఉప్పెన సినిమా విడుదలకు ముందే మైత్రీ మూవీస్ కు దిల్ రాజు మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ ఒక్క సినిమా ఇవ్వాల్సిందే అని దిల్ రాజు పట్టుబట్టి సాధించారు. పుష్ప సమయానికి విశాఖ ఏరియాను దిల్ రాజు నుంచి తప్పించారు. జిఎస్టీ చెల్లింపు, డెఫిసిట్ లు రాయడం ఇలాంటి విషయాల్లో దిల్ రాజు వైఖరి మైత్రీకి నచ్చలేదు.

నిజానికి అంతా దిల్ రాజును టార్గెట్ చేస్తారు కానీ, థియేటర్ల వ్యవహారం దిల్ రాజుకు సంబంధం లేదు. అదంతా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి చూసుకుంటారు. థియేటర్లు, పంపిణీ వ్యాపారానికి ఎవరు అడ్డం పడినా శిరీష్ రెడ్డి చాలా కటువువగా వ్యవహరిస్తారని, దిల్ రాజు మాదిరిగా ఆయన అంత మెత్తన కాదని ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటారు. శిరీష్ రెడ్డి తన కోపం, తన శతృత్వం దాచుకోరనీ వెంటనే తీర్చేసుకునే ప్రయత్నం చేస్తారని అంటారు.

విశాఖ ఏరియాలో ముఫై అయిదు వరకు థియేటర్లు శిరీష్ రెడ్డి చేతిలో వున్నాయి. తమకు ఇవ్వకుండా వేరే వాళ్లకు సినిమాలు ఇస్తే ఆ థియేటర్లు ఇవ్వకుండా ఆపడం అన్నది ఎప్పుడూ చేసే పని అని వైజాగ్ ఏరియా ఇండస్ట్రీ జనాలు కథలు కథలు చెబుతారు. విశాఖ మూడు జిల్లాల్లో శిరీష్ రెడ్డి సినిమాల విషయంలో వ్యవహరించే తీరును ఉదాహరణలతో సహా గంటలకు గంటలు వివరిస్తారు. కేవలం విశాఖ-నైజాం ఏరియాలను గుప్పిట్లో పెట్టుకుని, మిగిలిన జిల్లాల్లో టై అప్ లు పెట్టుకుని దిల్ రాజు ఇండస్ట్రీని శాసించడం అన్నది ఇప్పుడు పీక్ కు చేరుకుంది.

మైత్రీ సంస్థ, కావలి ప్రాంతానికి చెందిన శశి తో కలిసి నైజాంలో పంపిణీ సంస్థను ప్రారంభించింది. గతంలో ఈ ప్రయత్నం చాలా మంది చేసారు. కానీ ఆసియన్ సునీల్ కూడా తెర వెనుక శిరీష్ రెడ్డితో చేతులు కలపడంతో వాళ్లంతా విఫలమయ్యారని ఇండస్ట్రీలో చెప్పుతుంటారు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఒక్కప్పుడు నైజాంలో బలమైన పంపిణీ దారు. ఆయన కూడా చేతులు ఎత్తేసి దిల్ రాజుతో కలిసారు. వరంగల్ శ్రీను లాంటి వాళ్లు ఎదురు తిరిగినా కాలం కలిసి రాక సరైన సినిమాలు పడక గాయబ్ అయిపోయారు.

నిజానికి సురేష్ బాబు..ఆసియన్ సునీల్ తలుచుకుంటే నైజాంలో గట్టి పట్టు సాధించగలరు. కానీ వాళ్లు రిస్క్ బిజినెస్ చేయరు. ఒడ్డున కూర్చుని స్నానం చేస్తారు. తప్ప రిస్క్ తీసుకుని ఈత కొట్టరు. అదే దిల్ రాజు-శిరీష్ లకు కలిసి వచ్చింది.

ఇప్పటికే సునీల్..సుధాకర్..అనిల్ సుంకర. స్వప్న దత్..ఇలా పలువురు కలిసి సిండికేట్ గా మారి సినిమాలు కొనే పని ప్రారంభించారు. విశాఖలో గాయత్రీ ఫిలింస్ దిల్ రాజు కు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు మైత్రీ సంస్థ ప్రారంభమైంది. పండగ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయంటే చాలు. దిల్ రాజు-శిరీష్ లకు చెక్ పడిపోతుంది. అలా కాకుండా మైత్రీకి కాలం కలిసి రాకపోతే దిల్ రాజు హవా కొంతకాలం సాగుతుంది.

ఇదిలా వుండగా సంక్రాంతి కి బాలయ్య సినిమాకు పోటీగా దిల్ రాజు వారసుడు వస్తోంది. మళ్లీ థియేటర్ల సమస్య మొదలైంది. దీంతో బాలయ్యకు మద్దతుగా అన్నట్లుగా టాలీవుడ్ లో గొంతులు వినిపిస్తున్నాయి. కౌన్సిల్ నుంచి నోట్ వెళ్లింది. గిల్డ్ మీద సి. కళ్యాణ్ నిప్పులు తొక్కారు. సురేష్ బాబు కూడా గొంతు విప్ప బోతున్నారు.

మరోపక్కన బాలయ్య, మెగాస్టార్ సినిమాలకు ఇవ్వని థియేటర్ల దగ్గర అలజడి, ధర్నాలు జరుగుతాయనే గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. రెండు థియేటర్ల మీద అటాక్ జరిగితే అన్ని థియేటర్లు అవే దారిలోకి వస్తాయి అనే హెచ్చరికలు టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మొత్తం మీద చూస్తుంటే దిల్ రాజు-శిరీష్ ల హవా విషయంలో టాలీవుడ్ లో బ్రేక్ లు పడే సూచనలు పక్కగా కనిపిస్తున్నాయి.