టాలీవుడ్ లో ఓపెన్ ఫైట్

ఇన్నాళ్లు గిల్డ్-కౌన్సిల్ అంటూ దాగుడుమూతలు ఆడారు కానీ ఓపెన్ ఫైట్ కు దిగలేదు. ఇప్పుడు తొలిసారి కౌన్సిల్ ను తన చేతులోకి తీసుకొవాలని దిల్ రాజు అనుకోవడంతో, ప్రొగ్రెసివ్ పానెల్ అంటూ గిల్డ్ లో…

ఇన్నాళ్లు గిల్డ్-కౌన్సిల్ అంటూ దాగుడుమూతలు ఆడారు కానీ ఓపెన్ ఫైట్ కు దిగలేదు. ఇప్పుడు తొలిసారి కౌన్సిల్ ను తన చేతులోకి తీసుకొవాలని దిల్ రాజు అనుకోవడంతో, ప్రొగ్రెసివ్ పానెల్ అంటూ గిల్డ్ లో కీలకమైన వారంతా కలిసి పోటీకి దిగారు. ఇన్నాళ్లూ కౌన్సిల్ మీద ఆధిపత్యం వహిస్తూ వస్తున్న సి కళ్యాణ్, ప్రసన్నకుమార్ కు గట్టి సవాలు విసిరారు. 

ఆ మధ్య చాంబర్ విషయంలో తమకు అనుకూల ప్యానల్ గెలిచేలా చక్రం తిప్పిన దిల్ రాజు ఈ సారి కౌన్సిల్ మీద దృష్టి పెట్టారు. పదే పదే తమ కాళ్లకు అడ్డం పడుతున్న కౌన్సిల్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ ఆదివారం ఎన్నిక. దిల్ రాజు, టాగోర్ మధు, మైత్రీ రవి, భరత్ చౌదరి, దామోదర ప్రసాద్ ఇలా అంతా ప్రోగ్రెసివ్ అంటూ రంగంలోకి దిగారు.

ఎవరు గెలుస్తారు..ఎవరు ఓడుతారు అన్న సంగతి పక్కన పెడితే, ప్రోగ్రెసివ్ ప్యానల్ గెలిస్తే కౌన్సిల్ ను ప్రక్షాళన చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి అప్పుడు ఇన్నాళ్లు తను రన్ చేసిన గిల్డ్ సంగతి ఏమిటి అన్నది చూడాలి. లేదూ ఓడిపోతే ఇక కౌన్సిల్ ను వదిలేసే అవకాశం వుంది. అప్పుడు కౌన్సిల్ కు నిధుల సమస్య ఏర్పడవచ్చు. ఎందుకంటే యాక్టివ్ ప్రొడ్యూసర్ల నుంచి కంట్రిబ్యూషన్ వివిధ మార్గాల్లో రాకపోతే కౌన్సిల్ కు సమస్యే. ఈ చిక్కు ముడి అలా వుండనే వుంటుంది.

కౌన్సిల్ ఎన్నికల్లో మెంబర్ల సంఖ్య అన్నది కీలకం. ప్రసన్నకుమార్, కళ్యాణ్ లాంటి వారికి అండ ఈ మెంబర్ షిప్ నే. సినిమాలు తీయడం అన్నది ఏనాడో ఆపేసిన దాదాపు అయిదారు వందల మంది సభ్యులు వున్నారు. వీరందరికీ గిల్డ్ వ్యతిరేకం. వీరంతా తమ నిర్ణయాలు పారనివ్వడం లేదనే గిల్డ్ అనేది ఏర్పాటుచేసుకున్నారు. 

కొన్నాళ్ల క్రితం వీళ్లందరినీ నేను ఓటు అడుగుతానా? అని ఓ ఇంటర్వూలో దిల్ రాజే అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్యానల్ నే పోటీ పడుతోంది. మరి వీళ్లను ఓటు అడుగుతున్నారో..అడిగారో..అడగరో చూడాలి. పైగా ప్రోగ్రెసివ్ ప్యానల్ వస్తే తమకు ఇప్పటి వరకు వస్తున్న సదుపాయాలు వుంటాయో, ఊడుతాయో అన్న అనుమానం ఈ ఓల్డెస్ట్ సభ్యులకు వుండనే వుంది. ఇందులో కీలకమైనది భీమా సదుపాయం.

గిల్డ్ వస్తే భీమా వుంటుందా? రాకపోతే భీమా వుండడానికి అవకాశం వుంటుందా? అన్న అనుమానాలు వుండనే వున్నాయి. చాలా మందికి ఈ ఎన్నికల మీద ఎంత ఆసక్తి వుందో, అంత మందికి అనాసక్తి కూడా వుంది. ఏ పవర్ లేని సంఘం కౌన్సిల్. దీనికి ఇంత హడావుడి ఎందుకు అని ఓ యాక్టివ్ సీనియర్ ప్రొడ్యూసర్ అన్నారు. కౌన్సిల్ కన్నా ఛాంబర్ పవర్ ఫుల్ అన్నది ఆయన అభిప్రాయం.

ఇలాంటి నేపధ్యంలో గిల్డ్ లీడర్ దిల్ రాజు మీద సి కళ్యాణ్ ఓపెన్ గానే మరోసారి నిప్పులు చెరిగారు. కౌన్సిల్ ను, ఇండస్ట్రీని, చిన్న సినిమా నిర్మాతలను నాశనం చేయాలని దిల్ రాజు చూస్తున్నారు అనేంత గట్టి ఆరోపణలు చేసారు. మొత్తం మీద ఈ సారి ఎన్నికలు గట్టిగానే జరుగుతున్నాయి. పోటీ సెగ గట్టిగా తగలకుండా వుండి వుంటే సి కళ్యాణ్ ఇలా బహిరంగ ఆరోపణలకు దిగి వుండే వారు కాదనే అనుకోవాలి. ఇలా దిగారు అంటే గెలుపు భయం ముగింటకు వచ్చి వుండొచ్చు.

రేపు సాయంత్రానికి ఫలితాలు వస్తాయి. అప్పుడు ఇంకెలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు వినిపిస్తాయో చూడాలి.