ట్రేడ్ టాక్: అరణ్య తెల్లవారిపోయింది

వీకెండ్ గడిచింది. శుక్రవారం రిలీజైన సినిమాల జాతకాలు తేలిపోయాయి. నితిన్ నటించిన రంగ్ దే సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. రానా నటించిన అరణ్య సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు 'తెల్లవారితే గురువారం'…

వీకెండ్ గడిచింది. శుక్రవారం రిలీజైన సినిమాల జాతకాలు తేలిపోయాయి. నితిన్ నటించిన రంగ్ దే సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. రానా నటించిన అరణ్య సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు 'తెల్లవారితే గురువారం' అనే సినిమా రిజల్ట్ చెప్పడానికి డిజాస్టర్ అనే పదం కూడా చాలా చిన్నది.

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన రంగ్ దే సినిమాకు వారాంత మంచి వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 10 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే.. అటుఇటుగా 13 కోట్ల రూపాయలు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11 కోట్ల రూపాయలు రావాలి.

అటు రానా నటించిన అరణ్య సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రెండో రోజు చాలా ఏరియాల్లో ఆడియన్స్ లేక షోలు రద్దయ్యాయి. ఇక మూడో రోజు ఆదివారం ఓ మోస్తరు ఆక్యుపెన్సీ కనిపించినప్పటికీ సినిమా కోలుకోవడానికి అది ఏమాత్రం సరిపోదు.

మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కేవలం రెండున్నర కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. మొదటి వారాంతమే రెండున్నర కోట్లు అంటే.. వచ్చే వీకెండ్ కు సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక తెల్లవారితే గురువారం అనే సినిమా రెండో రోజు కూడా నిలవలేకపోయింది. కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ఈ సినిమా శనివారం రిలీజైంది. మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్. దీంతో ఆదివారం ఈ సినిమాకు జనాలు కూడా కరువయ్యారు. 

ఇవాళ్టి నుంచి ఈ సినిమాను చాలా థియేటర్లలో ఎత్తేయబోతున్నారు. ఈ సినిమాకు 2 రోజుల్లో చెప్పుకోలేనంత తక్కువగా వసూళ్లు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఆడిన థియేటర్ల కంటే.. రద్దయిన స్క్రీన్సే ఎక్కువగా ఉన్నాయి.