సినిమా పుట్టినప్పటి నుంచి ప్రేమ కథలున్నాయి. ప్రేమతో పాటు ముక్కోణపు ప్రేమ కూడా వుంది. అన్ని భాషల్లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అందులో సూపర్‌హిట్స్, ప్లాప్స్ వున్నాయి. సరిగా ప్లే చేస్తే ఈ ఎమోషనల్ డ్రామాకి తిరుగులేదు. అయితే డిజిటల్ యుగంలో ఎమోషన్స్ కూడా రూపురేఖలు మార్చుకుంటున్నాయి.
ప్రేమ ఎప్పుడూ ఒకటే ఫీలింగ్ కావచ్చు. 50 ఏళ్ల క్రితం లవ్ లెటర్ చేతిలో పట్టుకుని తిరిగే అబ్బాయిలు, అమ్మాయిని రోజుకు ఒకసారైనా చూడాలని ఇంటి నుంచి సైకిల్‌పై చక్కర్లు కొట్టే అబ్బాయిలు ఇప్పుడు లేరు. టెక్నాలజీ ప్రేమని మార్చేసింది. లవ్ లెటర్ అంతరించి పోయింది. అమ్మాయితో ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడొచ్చు, వీడియో కాల్ చేస్తే ఎప్పుడైనా చూడొచ్చు.
దసరా సినిమా విజువల్‌గా అద్భుతంగా ఉన్నా, వన్‌సైడ్ లవ్ మెయిన్ థీమ్ కావడంతో యూత్ పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ సినిమా కథాకాలం అర్థం కాలేదు. (94లో మద్యనిషేధం వస్తే, అక్కడి నుంచి 15 ఏళ్లు అంటే 2009లో కథ జరుగుతున్నట్టు. అప్పటికి సెల్ ఫోన్ల కాలం. కానీ సినిమాలో ఎక్కడా సెల్‌ఫోన్లు కనపడవు)
సెల్‌ఫోన్లు లేని ఊరు అనుకున్నా, 15 ఏళ్ల పాటు ప్రేమని దాచుకున్న కుర్రాళ్లు ఉన్నారా? అంటే అనుమానమే. సినిమా లిబర్టీ కోసం ఉన్నారనే అనుకుందాం. కానీ చూసే ప్రేక్షకులు 2023 నాటి వారు. ఉదయం ప్రేమించి సాయంత్రం బ్రేకప్ చెప్పుకునే స్పీడ్ లవ్. నమ్మకంతో ఒకరి ఫోన్లు ఇంకొకరికి ఇచ్చుకోలేరు (ఈ థీమ్‌తో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యింది). దసరాలో నాని ఎంత గొప్పగా నటించినా, ఎప్పుడూ ఏదో దిగులుతో కీర్తి సురేష్‌ని తలచుకుంటూ 90 ఎమ్ఎల్ తాగుతూ వుండడం (ఆ కాలంలో చీప్ లిక్కర్ 90 ఎమ్ఎల్ బాటిల్స్ వున్నాయా? ఎక్సైజ్ వాళ్లకే తెలియాలి) కొంచెం చిరాకు అనిపించింది.
ఆకర్షణ, ప్రేమ యూనివర్సల్ అయినా, ఒకరి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడడం, ఐ లవ్ యూ చెప్పడానికి కిందామీదా పడడం ఇప్పటి యూత్ లక్షణం కాదు. దేవత సినిమాలో జయప్రద కోసం శ్రీదేవి ప్రేమని త్యాగం చేస్తే అప్పుడు కన్నీళ్లు పెట్టారు కానీ, ఇప్పటి అమ్మాయిలు నవ్వుకుంటారు. ఏళ్ల తరబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లే, అభిప్రాయాలు నచ్చకపోతే అడ్జెస్ట్ కాలేక విడాకులు తీసుకుంటున్నారు.
సాంప్రదాయవాదులు ఎంత నెత్తినోరూ మొత్తుకున్నా ఇదే ప్రజెంట్ ట్రెండ్. అశాంతితో, అయిష్టంతో జీవితమంతా బతకడానికి యూత్ సిద్ధంగా లేదు. ప్రేమకి కూడా నిర్వచనం మారిపోయింది. బ్రేకప్‌కి ఈజీగా వెళుతున్నారు. బ్రేకప్ తర్వాత ప్రపంచం మునిగిపోయినట్టు ఎవరూ కుంగిపోవడం లేదు. పార్టీల్లో బాటిల్ ఎత్తేవాళ్లు తప్ప, దేవదాసులా పార్వతిని తలచుకుని లీవర్ చెడగొట్టుకునే వాళ్లు ఎవరూ లేరు. జనరేషన్ గ్యాప్ అంటారు దీన్ని.
ఇప్పుడున్న డిజిటల్ స్పీడ్‌కి ఐదు పదేళ్లకే రాజకీయ, సాంస్కృతిక భావజాలం మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా మారిపోతున్నాయి. అమ్మానాన్న అన్నదమ్ముల ప్రేమలుంటాయి. ఎక్కడికీ వెళ్లవు. కొలమానాలు మారుతాయి. అమ్మాయి, అబ్బాయి ప్రేమ కూడా అంతే. ఒక మెసేజ్ ఇస్తే ప్రేమ చెప్పొచ్చు. దానికి ఏళ్ల తరబడి వెయిట్ చేయడం ఎందుకు? ఉమ్మడి కుటుంబం ఎలాగైతే సినిమా కథల్లోంచి మాయమైందో, కొంత కాలానికి ట్రయాంగిల్ లవ్ కూడా మాయమైపోతుంది.
జీఆర్ మహర్షి