అనుభవం అయితే తత్వం బోధపడుతుంది. గుణపాఠాలు..పాఠాలు నేర్పుతాయి. దాంతో మార్పు అనివార్యమవుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ స్థితిలోనే వున్నట్లు వున్నారు. గతంలో త్రివిక్రమ్ మీద చాలా వార్తలు వచ్చాయి. కేరవాన్ లో కూర్చుని అప్పటికప్పుడు సీన్ లు రాసి, ఇస్తారని, కథ ఏమిటి అన్నది ముందుగా చెప్పరని, లైన్ మాత్రమే చెబుతారని ఇలా రకరకాలుగా. అవన్నీ నిజాలే అనుకుంటే ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు అనుకోవాలి.
ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ కావడం, మహేష్ తో ఓ భారీ యాక్షన్ సినిమా మొదలుపెట్టి ఓ షెడ్యూలు చేసి పక్కన పెట్టడం వంటి సంఘటనలు ఆయనలో ఈ మార్పును అనివార్యం చేసినట్లున్నాయి. కథ మొత్తం చెప్పే వరకు సెట్ మీదకు వచ్చేది లేదని సూపర్ స్టార్ మహేష్ భీష్మించుకు కూర్చోవడంతో టైమ్ తీసుకుని, మొత్తం మీద ఒకటికి రెండు మూడు సిటింగ్ లు వేసి కథ అంతా చెప్పారు. ఒకె అనిపించుకున్నారు.
అక్కడితో ఆగకుండా దుబాయ్ లో సూపర్ స్టార్ వుంటే అక్కడకు వెళ్లి, సినిమా వ్యవహారాలు, కాస్టింగ్, ప్రొడక్షన్, షెడ్యూళ్లు ఇవన్నీ పూర్తిగా అంగుళం అంగుళం డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుని వచ్చారు. త్రివిక్రమ్ లో మార్పు అక్కడితో ఆగిపోలేదు. హీరో హీరోయిన్లను కూర్చోపెట్టి మొత్తం సీనిక్ ఆర్డర్, డైలాగ్ వెర్షన్ ఫుల్ నేరేషన్ ఇచ్చారు.
ఇవన్నీ అయిన తరువాత ఇంకేం విఘ్నాలు కలుగకుండా వుండాలని తిరుపతి వెళ్లి ‘పెద్దాయిన’.. వెంకన్న దర్శనం చేసుకుని వచ్చారు. ఇక ఇప్పుడు సెట్ మీదకు వెళ్లబోతున్నారు. ఈ మార్పు తివిక్రమ్ వర్క్ లో కూడా కనిపిస్తుందని, వింటేజ్ త్రివిక్రమ్ ఫన్ డైలాగులు పేలుతాయని, మాంచి సినిమా అందిస్తారని ఆశిద్దాం.
ఈ మార్పుకు మూలం మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబే. అందులో సందేహం లేదు.