ఆదిపురుషుడే కావచ్చు. రామాయణ కథా చిత్రమే కావచ్చు. కానీ అవి కాదు కీలకం. అందులో హీరో ఎవరు? అదే కావాలి యాంటీ హీరోలకు. తెలుగులో హీరోలు అందరి మధ్య సయోధ్య వుండొచ్చు. లేకపోవచ్చు. కానీ ఫ్యాన్స్ వ్యవహారం వేరే వుంటుంది. వాళ్ల హీరో రికార్డులు వారివి. వాళ్ల హీరోల సినిమాలు వారివి. యాంటీ హీరో సినిమా వచ్చింది అంటే ఎలా ట్రోల్ చేయాలన్నదే ఆలోచన. ఇక్కడ ఫేక్ అక్కౌంట్స్ కూడా వుంటాయి. వాళ్లకు ఈ హీరో, ఆ హీరో అని కాదు, ఏ హీరో సినిమా వచ్చినా మరేదో హీరో బొమ్మ అడ్డం పెట్టుకుని ట్రొల్ చేయడం. అదో కళ.
ఇప్పటికే ఆదిపురుష్ మీద కొంతమంది ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. తొలి రోజు రికార్డు మీద కన్నేసి వుంచారు. మలి రోజు వ్యవహారం ఎలా వుంటుంది. ఏ థియేటర్ ఫుల్ కాలేదు. ఏ థియేటర్ ఖుల్లా వుంది ఇవన్నీ ఇక సోషల్ మీడియాలోకి వస్తాయి. ఇవన్నీ కన్నా ముందుగా దృష్టి పెట్టేది కంటెంట్ మీద. రావణుడు ఎలా వున్నాడు. రాముడు ఎలా వున్నాడు. సీన్లు ఎలా వచ్చాయి. సిజి ల సంగతేమిటి?
ఇక ఈ పోస్ట్ మార్టమ్ అంతా సోషల్ మీడియాలో రేపు ఉదయానికల్లా పరుచుకోబోతోంది. అసలే ఆదిపురుష్ టీజర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి సిజి వర్క్ క్వాలిటీ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అలాగే రావణుడి గెటప్ మీద కూడా. ట్రయిలర్లు రెండు వచ్చాయి. సిజి ల మీద కాస్త భరోసా వచ్చింది. కానీ రావణుడి మీద అనుమానం ఇంకా వుండనే వుంది.
ఆదిపురుష్ హాలీవుడ్ సినిమా కాదు. వేల కోట్ల ఖర్చుతో అద్భుతమైన గ్రాఫిక్స్ వుండడానికి. రాజమౌళి బాహుబలి నాటి ప్రభాస్ కాదు. లుక్ ఆ రేంజ్ లో వుండడానికి. కాస్తయినా తేడా వుండొచ్చు. లేకపోవచ్చు. మొత్తం మీద ఎలా వున్నా ట్రోలింగ్ ను ఈ ఆదిపురుషుడు తట్టుకోవాల్సి వుంటుంది.
ఇప్పటికైతే తొలి వీకెండ్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ ట్రోలింగ్, విమర్శలు ఏ రేంజ్ లో వుంటాయి అన్న దాన్ని బట్టే ఫస్ట్ వీకెండ్ తరువాత కలెక్షన్లు వుంటాయి.