మొన్నటివరకు ఓజీ అప్ డేట్స్ ఇస్తుంటే పొంగిపోయారు. ఆహా..ఓహో అంటూ డీవీవీని ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా రావడం లేదు. దీంతో పొగిడిన నోళ్లే తిడుతున్నాయి. అప్ డేట్ ఇవ్వరా బాబూ అంటూ ప్రాధేయపడుతున్నాయి.
నిజానికి ఓజీకి సంబంధించి కీలకమైన అప్ డేట్ ఇవ్వాల్సిన సమయం ఇదే. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఆ తేదీకి రాదంటూ గడిచిన కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఎప్పుడైతే అదే డేట్ కు దేవర పోస్టర్ వేశారో, అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు.
ఓజీ వాయిదా పడిందనే విషయం పక్కా. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. కంప్లయింట్స్ కూడా లేవు. మరి అలా వాయిదా పడిన సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది..? కొత్త తేదీ ఫిక్స్ చేశారా లేదా..? ఫిక్స్ చేస్తే ఎప్పుడు చెబుతారు..? ఈ అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్.
కానీ డీవీవీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇది చెప్పడం లేదు. వాళ్లు నాని నటిస్తున్న సరిపోదా శనివారం అప్ డేట్స్ తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా నుంచి అప్ డేట్ వస్తున్న ప్రతిసారి పవన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఓజీ అప్ డేట్ చెప్పి ఏదైనా చేస్కో అంటూ ట్రోల్ చేస్తున్నారు.