నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. . నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివనిర్వాణ దర్శకుడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు.
మజిలీ తరువాత ఈ చిత్రం మొదలైంది. మజిలీ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్‌లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నాం. శివ గారు టక్ జగదీష్ కథ చెప్పారు. మా బ్యానర్ ప్రారంభమైంది నాని తోనే. ఆయనకు టక్ జగదీష్ కథ చెప్పాం.. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు.
ఇప్పటి వరకు ఆయన పోషించని పాత్ర ఇది. ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా టక్ జగదీష్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని అనుకుంటారు.
సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. ద్వితీయార్థం మొత్తం కూడా ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. అక్కా తమ్ముడు, అమ్మ కొడుకు ఇలా అందరి మధ్య ఎమోషన్స్ ఉంటుంది. కంటెంట్ ఎక్కడా దారి తప్పకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ అంతగా జొప్పించలేదు. కానీ కథకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది.
ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఈ లెక్కన అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. బిగ్ స్క్రీన్‌లో ఉన్నంత రెవెన్యూ ఓటీటీకి ఉండదు. ఉప్పెన, జాతిరత్నాల రిజల్ట్ ఎలా ఉందో అందరం చూశాం. రిస్క్ తీసుకున్నాం. ఇన్నాళ్లూ ఎదురుచూశాం. కానీ ఇంకా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియడం లేదు. అందుకే బయటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేయాల్సిందే. కానీ శివ, గోపీ సుందర్ మధ్య మంచి ర్యాపో ఉంది. మజిలీ, నిన్ను కోరి సినిమాలకు గోపీ సుందర్ సంగీతం అందించారు. కాబట్టి గోపీ సుందర్ నుంచి ఇంకా బాగా తీసుకోగలను అనే నమ్మకంతో శివ నిర్వాణ ఉన్నారు. అందుకే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం.